మీరూ మీమ్స్ చేస్తారా.? మీమ్స్‌తో సోషల్ మీడియాలో మీకు ప్రత్యేకంగా పేజీ ఒకటుందా.? అయితే ఈ వార్త మీకోసమే. కాలు బయట పెట్టకుండా.. ఇంట్లో నుంచే లక్షల్లో సంపాదన ఆర్జించవచ్చు. కేవలం మీరు చేయాల్సిందల్లా మీమ్స్ చేసుకుంటూ పోవడమే.. దానికి ప్రతిఫలంగా భారీ శాలరీ ప్యాకేజీ మీ సొంతం.! ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? నిజంగా నిజమండీ బాబూ..
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అంతటా మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే మన పేజీలకు సైతం ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి మీమ్స్ అనేవి బెస్ట్ ఆప్షన్. ఇక ఈ మీమ్స్‌ను పలు సంస్థలు తమ బ్రాండింగ్‌కు వాడుకుంటున్నాయి. యూజర్లను ఆకట్టుకునే విధంగా మీమ్స్ క్రియేట్ చేస్తే చాలు.. అవి వైరల్ అయ్యి.. సదరు సంస్థలకు కావల్సినంత పబ్లిసిటీని అందిస్తాయి.
ఈ తరుణంలో బెంగళూరుకు చెందిన స్టాక్‌గ్రో అనే సంస్థ మీమర్స్‌కు ఓ బంపరాఫర్ ప్రకటించింది. చీఫ్ మీమ్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఇచ్చి.. నెలకు రూ. 1 లక్ష శాలరీ ఇస్తామని పేర్కొంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ విభాగాలలోని మిలీనియల్స్, జనరేషన్ జెడ్ వయస్సు వారిని లక్ష్యంగా మీమ్స్ చేయాలంటూ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీలోని టాలెంట్ చూపించి.. అదిరిపోయే మీమ్స్ తయారు చేసెయ్యండి.