మొన్నమొన్నటి దాకా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అందుకే, అభివృద్ధయినా, సంక్షేమమైనా .. అంతా బానే ఉందనేవారు. ఇప్పుడేమో విపక్షంలా మారి.. ప్రజా సమస్యలపై పోరుబాట పట్టారు. ఆయన మరెవరో కాదు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరులో మరోసారి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒకప్పుడు జగన్‌కు వీరవిధేయుడనని చెప్పుకొన్న కోటం రెడ్డి.. వైసీపీ నుంచి సస్పెండయ్యాక.. తనదైన రూట్‌లో దూసుకెళ్తుండటమే దీనికి కారణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి.. పొట్టేపాలెం కలుజపై వంతెనకు డిమాండ్ చేస్తూ జలదీక్షకు పిలుపునిచ్చారు. ఈ వ్యవహారమే.. లోకల్‌గా పరిస్థితిని వేడెక్కించింది. పోలీసులు ముందుజాగ్రత్తగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గృహనిర్బంధం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. జలదీక్షకు అనుమతి లేదంటూ… ఆయనను నివాసం నుంచి బయటకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు శ్రీధర్‌రెడ్డి. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న కోటంరెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసం దగ్గరికి చేరుకుని మద్దతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో మోహరించారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం అయిదింటి వరకు ఎమ్మెల్యే నివాసం దగ్గరే పహారా కాశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ రెడ్డి ప్రజా ఆందోళనలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలనుకుంటే అది వారి అమాయకత్వమేనని జగన్‌పై నిప్పులు చెరిగారు. ఈ నెల 13న ప్రభుత్వం నిర్వహించబోతున్న ‘జగనన్నకు చెప్పుకుందాం రండి’ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్‌లో ప్రజలు చెప్పింది విందాం రండి నిర్వహించబోతున్నట్లు కోటం రెడ్డి ప్రకటించారు. రాబోయే రోజుల్లోఅమరావతిలోనూ గాంధీగిరి పద్ధతిలో నిరసనకు ప్లాన్ చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.