Guntur: గుంటూరు తొక్కిసలాట దుర్ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధితులకు అండగా ఉంటామని ప్రకటన
గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు.
కందుకూరు విషాదాన్ని మర్చిపోకముందే మరో ఘోరం జరిగిపోయింది. కొత్త ఏడాది రోజున చంద్రబాబు గుంటూరు ప్రోగ్రామ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు చనిపోయారు. ఒక మహిళ స్పాట్‌లోనే చనిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించారు. అందులో ఒకరిని గోపిశెట్టి రమాదేవి, మరొకరిని ఆసియాగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే మహిళల్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లక్ష్మమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానుకల కోసం మహిళలు ఒకేసారి తోసుకురావడం వల్లే తొక్కిసలాట జరిగింది. 15 లారీల్లో కానుకలను తీసుకొచ్చింది. 15 కౌంటర్లు పెట్టారు. ఫస్ట్ కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ముందు వైపు ఉన్న బారికేడ్ విరిగిపోవడంతో వెనుక ఉన్న మహిళలు ఒక్కసారిగా ముందుకు తీసుకొచ్చారు. దాంతో ముందున్న వారు కిందపడిపోయారు. వారిపై మహిళలు పడటంతో ఊపిరి ఆడక స్పృహ తప్పిపడిపోయారు.
గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగానిలుస్తుందన్నారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 1, 2023
ఘటన స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును చూశారు. బారికేడ్లు విరిగిపోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళల్ని పరామర్శించారు వైద్య శాఖ మంత్రి విడదల రజిని. బాధితులకు అందుతున్న వైద్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఏం జరిగిందని తెలుసుకున్నారు. టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన మహిళలకు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం 13 మందికి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం.