Rangareddy: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్.. పరారీలో మరొకరు.. తమిళనాడు నుంచి వచ్చి మరీ..

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 23, 2023 | 5:20 AM

Rangareddy District: గత ఏప్రిల్​ నెల నుంచి రాత్రివేళల్లో మహేశ్వరం, పహాడిషరీఫ్​, కందుకూరు పోలీస్​స్టేషన్​ల పరిధిల్లో పార్కింగ్​ చేసిన ద్వి,త్రి చక్ర వాహనాలు మాయమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న కేసులు పెరగడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ఈ గస్తీలో భాగంగానే మంగళవారం ఉదయం తుక్కుగూడలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయానికి అటుగా బైక్​పై వస్తున్న ముగ్గురు యువకులు పోలీసులను చూసి అనుమానస్పదంగా వ్యవహరించసాగారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని..

Rangareddy: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్.. పరారీలో మరొకరు.. తమిళనాడు నుంచి వచ్చి మరీ..
Pahadishareef Police
Follow us on

రంగారెడ్డి జిల్లా, ఆగస్టు 23: కష్టపడితే వచ్చే డబ్బులు చాలడం లేదని ద్వి చక్ర, త్రిచక్ర వాహనాల చోరీకి పక్కా స్కెచ్​ వేశాడు ఓ యువకుడు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు నుంచి మరో ఇద్దరు స్నేహితులను పిలిపించుకుని గత 5 నెలలుగా బైక్​లు, ఆటోలు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. దొంగిలించిన వాహనాలను తమిళనాడుకు తరలించి విక్రయిద్దామనుకున్న తరుణంలో పోలీసులకు చిక్కారు. 7 లక్షల రూపాయల విలువైన వాహనాలను దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం రిమాండ్​కు తరలించారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహేశ్వరం డివిజన్​ ఏసీపీ శ్రీనివాస్​ పహాడిషరీఫ్​ ఇన్​స్పెక్టర్​ సతీష్​ కుమార్​తో కలిసి మంగళవారం మహేశ్వరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సబంధించిన వివరాలను వెల్లడించారు.

గత ఏప్రిల్​ నెల నుంచి రాత్రివేళల్లో మహేశ్వరం, పహాడిషరీఫ్​, కందుకూరు పోలీస్​స్టేషన్​ల పరిధిల్లో పార్కింగ్​ చేసిన ద్వి,త్రి చక్ర వాహనాలు మాయమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న కేసులు పెరగడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ఈ గస్తీలో భాగంగానే మంగళవారం ఉదయం తుక్కుగూడలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయానికి అటుగా బైక్​పై వస్తున్న ముగ్గురు యువకులు పోలీసులను చూసి అనుమానస్పదంగా వ్యవహరించసాగారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ముగ్గురిలో ఇద్దరు చిక్కారు. మరొ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. వారిని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించగా చేసిన నేరాలను అంగీకరించారు.

ఇవి కూడా చదవండి

వారు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు మధురైకు చెందిన పోతురాజు ముత్తురామన్​ అలియాస్​ ముత్తు(26) గత కొంత కాలం క్రితం మహేశ్వరంకు వలస వచ్చారు. ముత్తు ఒక ఇల్లును అద్దెకు తీసుకుని మిక్షర్​ తయారు చేస్తూ సమీప ప్రాంతాలలోని కిరాణా దుకాణాలకు విక్రయించేవాడు. అయితే రాత్రి వేళల్లో పార్కింగ్​ చేసి ఉన్న ద్వి, త్రి చక్ర వాహనాలను దొంగిలించి తమిళనాడులో విక్రయిస్తే ఆర్థికంగా స్థిరపడవచ్చని చోరీలకు స్కెచ్​ వేశాడు. దీంతో తమిళనాడుకు చెందిన తన స్నేహితులైన సంతోష్​కుమార్​(20), పరిమళ్ ​రామ్​లను మహేశ్వరంకు పిలిపించుకున్నారు. ముందుగా వేసుకున్న ప్లాన్​ ప్రకారం ముత్తు బైక్‌ల​ దొంగతనాలకు అనువైన ప్రాంతాన్ని గుర్తించి అతని స్నేహితులకు చెప్పేవాడు. మాస్టర్​ కీ సహాయంతో అర్థరాత్రి వేళల్లో ఇప్పటి వరకు 7 బైక్​లు, మూడు ఆటోలను దొంగిలించినట్లు పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. దీంతో దొంగిలించిన వాహనాలను తమిళనాడుకు తీసుకెళ్లి విక్రయించాలని వేసిన కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లయింది. అలాగే నిందితుల వద్ద నుంచి పోలీసులు  రూ.7 లక్షల విలువైన వాహనాలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు పాల్పడ్డ ముత్తు, సంతోష్​కుమార్​లను అరెస్ట్​ చేసి మంగళవారం రిమాండ్​కు తరలించారు. పరారీలో ఉన్న పరిమళ్​ రామ్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును పహాడిషరీఫ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.