క్రికెట్‌లో ఇటీవల మన్కడింగ్ ఔట్ పదం తరచూ చర్చనీయాంశమవుతోంది. బంతిని వేయకముందే బ్యాటర్లు క్రీజును వదిలిపెట్టినప్పుడు, బౌలర్లు వెంటనే వికెట్లను పడగొట్టి సదరు బ్యాటర్‌ను పెవిలయన్‌కు పంపించవచ్చని ఐసీసీ నిబంధనల్లో మార్పులు తెచ్చింది. అందుకు తగ్గట్లే ఇటీవల పలువురు బౌలర్లు నిబంధనలకు విరుద్ధంగా క్రీజును వదిలిపెట్టిన బ్యాటర్లను మన్కడింగ్ ఔట్ చేశారు. కొన్ని నెలల క్రితం టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఇంగ్లండ్ బ్యాటర్‌ను ఇలాగే ఔట్ చేసింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయ. బ్రిటిష్ మీడియా, మాజీ క్రికెటర్లు ఆమె క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదంటూ విమర్శలు గుప్పించారు. అదే సమయంలో దీప్తి ఐసీసీ నిబంధనలకు లోబడే ప్రవర్తించిందని టీమిండియా క్రికెటర్లు సపోర్టుగా నిలిచారు. ఆతర్వాత ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇటీవల బిగ్‌బాష్ లీగ్‌లో కూడా ఆడమ్ జంపా చేసిన మన్కడింగ్ తీవ్ర చర్చనీయాంశం అయింది. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది. బౌలర్ బంతి వేయకముందే నాన్ స్ట్రైకర్ దాదాపు మిడిల్ పిచ్ వరకు వెళ్లిపోయాడు.
ఇక్కడ బ్యాటర్‌ను రనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. బౌలర్ ఆ పని చేయలేదు. కేవలం వార్నింగ్‌తోనే సరిపెట్టాడు. అయితే పిచ్ మధ్య వరకు వెళ్లిన బ్యాటర్ మళ్లీ వెనుక్కి వచ్చే ప్రయత్నం చేయకపోవడం గమానార్హం. సైప్రస్ మౌఫ్లన్స్- పంజాబ్ లయన్స్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘అంత తొందరెందుకు బ్రో, కొంచెం బంతిని చూసి వెళ్ల వచ్చుకదా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Incredible backing up? #EuropeanCricket #EuropeanCricketLeague #ThrowbackECL22 pic.twitter.com/lZZroI2X3V
— European Cricket (@EuropeanCricket) January 6, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..