కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 కల్లా దేశంలోని రహాదారులు అమెరికాతో సమానంగా ఉంటాయని పేర్కొన్నారు. గ్రీన్ ఎక్స్ ప్రెస్ వేలు, రైలు వంతెనలు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. భారత్ మాల 2 కు త్వరలోనే కేంద్ర కేబీనేట్ ఆమోదం ఇవ్వనుందన్నారు. ఈ ప్రాజెక్టు దేశంలోని మౌలిక సదుపాయాల అవసరాలు తీరుస్తుందని తెలిపారు. ఈ ఏడాది రైలు వంతెనలను రూ.16 వేల కోట్లతో నిర్మించనున్నామని..మరో ఐదేళ్లలో వాటిని రూ. 50 వేల కోట్లుకు పెంచుతామని తెలిపారు. పితోర్ గఢ్ మీదుగా చేపట్టిన కైలాష్ మాన్సారోవర్ హైవే ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 93 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. భారత్ మాల 2 ప్రాజెక్టు కింద మొదటగా 5 వేల కిలోమీటర్ల రహాదారులు నిర్మిస్తామని పేర్కొన్నారు.
భారత్ మాల పరియోజన ప్రాజెక్టు కింద మొత్తం 35,000 కిలోమీటర్ల జాతీయ రహాదారులు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 580 జిల్లాలను అనుసంధానం చేయనున్నామన్నారు. ఝార్ఖండ్ లో రూ.70 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేలు, ఎకనామిక్ కారిడార్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మెరుగైన రోడ్ల అనుసంధానం కోసం రూ.50 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..