బిహార్ లోని ససారాం , బీహార్ షరీఫ్ , నలందా జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. అల్లర్లను అదుపు చేయడానికి పారామిలటరీ బలగాలను కేంద్రం రంగం లోకి దింపింది. అల్లరిమూకలను ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం నితీష్‌కుమార్ ఆదేశించారు.బిహార్ లోని ససారం , నలందాలో శ్రీరామనవమి సందర్భంగా చెలరేగిన హింస ఇంకా చల్లారడం లేదు. వరుసగా మూడో రోజు ససారాంలో హింస చెలరేగింది. తాజా అల్లర్లలో ఒకరు చనిపోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్రం కూడా రంగం లోకి దిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలను రంగం లోకి దింపారు ఇప్పటివరకు 116 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బిహార్‌లో హింసపై బీజేపీ , జేడీయూ నేతల మధ్య మాటలయుద్దం ముదిరింది. హింస వెనుక బీజేపీ నేతల హస్తముందని సీఎం నితీష్ ఆరోపించారు. బిహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్ వచ్చిందని బీజేపీ కౌంటరిచ్చింది. పరిస్థితిని అదుపు చేయడానికి నలందా , ససారాం, బిహార్ షరీప్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలను విధించారు. అనుమానితులను అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. బిహార్ షరీఫ్ నలందలో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసు బలగాల మోహరింపు కొనసాగుతోంది.
కాగా ప్రజలు ఇళ్ల నుంచి పారిపోతునట్టు సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. రామనవమి యాత్ర ఘర్షణల్లో పాల్గొన్న వారందరినీ సీసీ కెమెరాల సహాయంతో గుర్తించామనీ, బీహార్ యంత్రాంగం ఎవరినీ వదిలిపెట్టబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బిహార్‌లో శాంతి భద్రతలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. నవాదాలో జరిగిన సభలో సీఎం నితీష్ , డిప్యూటీ సీఎం తేజస్విపై తీవ్ర విమర్శలు చేశారు. నితీష్‌ను ఎప్పటికి ఎన్‌డీఏలో చేర్చుకోబోమన్నారు అమిత్‌షా. అలాగే తాము అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడినవారిని తలకిందులుగా వేలాడదీస్తామని తెలిపారు. ‘బిహార్‌లో శాంతి కోసం నేను దైవాన్ని ప్రార్ధిస్తున్నా.. ఇక్కడి ప్రభుత్వంతో లాభం లేదు. గవర్నర్‌కు ఫోన్ చేసి నేను వివరాలు తెలుసుకున్నా.. నా ఫోన్ కాల్ జేడీయూ అధ్యక్షుడు లల్లన్‌సింగ్‌కు కోపం తెప్పించింది. బిహార్ గురించి మీకెందుకు బాధ అని అడుగుతున్నారు. నేను దేశ హోంమంత్రిని. బిహార్ కూడా దేశంలో అంతర్భాగమే. మీరు అదుపు చేయడం లేదు. అందుకే కేంద్రం జోక్యం చేసుకుంటోంది. ‘ అమిత్ షా వ్యాఖ్యానించారు. అయితే అమిత్‌షా వ్యాఖ్యలను జేడీయూ నేతలు తీవ్రంగా ఖండించారు. మతం పేరుతో బీహార్‌లో అల్లర్లు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..