న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని మార్చి 30న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఇందులో భాగంగా.. ఇటీవల తనపై వచ్చిన వివాదాల గురించి బాలీవుడ్ మీడియాతో చర్చించారు హీరో నాని. తాను ఏం మాట్లాడినా సమస్యే అవుతోందని ఆయన అన్నారు. ఈ మేరకు గతంలో తాను టికెట్ ధరల విషయంపై అభిప్రాయాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచినట్లు వెల్లడించారు. దర్శకుడు సుకుమార్ ను తక్కువ చేసి తాను మాట్లాడినట్లు వస్తోన్న వార్తలపై స్పందించారు. సుకుమార్ అంటే తనకు గౌరవం ఉందని.. తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని అన్నారు.
“చిన్న విషయానికే పెద్ద సమస్యల్లో చిక్కుకున్నారా ? అని విలేకరి ప్రశ్నించగా… నాని మాట్లాడుతూ..”సమస్యలు ఎదుర్కొన్నాను. నేను మాట్లాడిన చిన్న చిన్న మాటలే పెద్ద సమస్యలు తీసుకువచ్చాయి. ఆ విషయాల గురించి ఇప్పుడు చెబితే అది మరొక సమస్యకు దారి తీస్తుంది. ఉదాహరణకు శ్యామ్ సింగరాయ్ సమయంలో టికెట్ ధరల గురించి నా అభిప్రాయాన్ని మాములుగా చెప్పాను. ఆ తర్వాతే అదే పెద్ద సమస్యగా మారింది. నేను ఏం మాట్లాడినా సరే ఎదుటివాళ్లు మరోలా అర్థం చేసుకుని మీరు అలా చెబుతున్నారు ?… ఇలా ఎందుకు అంటున్నారు ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎదుటివ్యక్తులను కించపరిచేలా అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం లేదు. కేవలం నా ఉద్దేశాన్ని చెబుతున్నానంతే. ఇటీవల డైరెక్టర్ సుకుమార్ విషయంలోనూ అదే జరిగింది. ఇంత చర్చకు దారితీసేలా నేను మాట్లాడలేదు.దసరా సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల నేనొక మీడియాతో ముచ్చటించాను. అందులో ప్రతి ఒక్కరూ అగ్ర దర్శకులతో పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. మీరెందుకు ఇలా కొత్త దర్శకులతో వెళ్తున్నారు ? అని అడిగారు. అందుకు నేను మాట్లాడుతూ.. ఆయా దర్శకులకు మన దగ్గర పాపులారిటీ ఉన్నప్పటికీ వేరే ఇండస్ట్రీలకు కొత్తే కదా.. సుకుమార్ కు తెలుగులో గొప్ప పేరు ఉండొచ్చు.. కానీ పుష్ప తర్వాతనే ఆయన వేరే చోట్ల ఖ్యాతి సొంతం చేసుకున్నారు. నా దర్శకుడు ఇప్పుడు అన్ని పరిశ్రమలకు కొత్త వాడే అయినా.. తర్వాత మంచి పేరు సొంతం చేసుకోవచ్చు అని చెప్పాను. నా మాటలను తప్పుగా అర్థం చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.