Union Budget 2023: బడ్జెట్‌లో వేతన జీవులకు కేంద్రం వరాల జల్లు కురిపించనుందా.. పన్ను పరిమితుల్లో మార్పులుండే ఛాన్స్..

Union Budget 2023: మరో నెల రోజుల్లో కేంద్రప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మాంద్యం హెచ్చరికల నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలకు, ముఖ్యంగా వేతన జీవులకు ఎలాంటి గుడ్ న్యూస్‌ అందిస్తుందా అంటూ వారంతా..

Union Budget 2023: బడ్జెట్‌లో వేతన జీవులకు కేంద్రం వరాల జల్లు కురిపించనుందా.. పన్ను పరిమితుల్లో మార్పులుండే ఛాన్స్..
Tax Deduction Expectations In Upcoming Inion Budget 2023 24
Follow us
Amarnadh Daneti

| Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2023 | 2:28 PM

Union Budget 2023: మరో నెల రోజుల్లో కేంద్రప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మాంద్యం హెచ్చరికల నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలకు, ముఖ్యంగా వేతన జీవులకు ఎలాంటి గుడ్ న్యూస్‌ అందిస్తుందా అంటూ వారంతా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పన్ను పరిమితుల్లో మార్పులు చేసే ఛాన్స్ ఉండొచ్చనే అభిప్రాయాలను ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో దాదాపు 8 కోట్లకు పైగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో కార్పోరేట్‌ కంపెనీ ఉద్యోగులతో పాటు.. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. బడ్జెట్‌ సమయంలో ప్రభుత్వం ఆదాయపన్నుల విషయంలో తీసుకునే నిర్ణయం వేతన జీవులపై ఎంతో ప్రభావం చూపించనుంది. పేద, మధ్య తరగతి ప్రజల బడ్జెట్‌పై కూడా కేంద్రబడ్జెట్ ప్రభావం ఉంటుంది. వేతన జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయాల్లో ప్రధానమైనవి సెక్షన్‌ 80సీలో ఆదాయ పరిమితి పెంపుతో పాటు.. సెక్షన్ 16 (ia) పరిమితి మొదలైనవి ఉన్నాయి. ఈ పన్ను చెల్లింపుల్లో ఆదాయ పరిమితిని పెంచినట్లైతే ఎంతో మంది మధ్యతరగతి ప్రజలు లబ్ధిపొందనున్నారు.

సెక్షన్ 80C

ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం 80సీలో లక్షా 50 వేల రూపాయల వరకు పలు పథకాల్లో పెట్టుబడులు, పిల్లల స్కూల్‌ ఫీజు మొదలైన వాటి విషయంలో పన్ను మినహాయింపు పొందవచ్చు. చివరిగా 2014వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని లక్షా 50 వేల రూపాయల వరకు పెంచింది. ఆ తర్వాత నుంచి ఇప్పటిరకు ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో తప్పకుండా 80సీ పన్ను మినహాయింపులో ఆదాయ పరిమితిని కనీసం రూ.2లక్షల వరకు పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిమితిని పెంచితే పొదుపు పెరగడంతో పాటు.. ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం కలగనుంది.

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశం

ఆదాయపు పన్ను చట్టం దేశంలోని పౌరులపై పన్నులు విధించడంతో పాటు.. పలు మినహాయింపులు, రాయితీలను క్లెయిమ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. పన్ను చెల్లింపుదారులు ఆదాయం, ఖర్చు చేసిన విధానంపై మినహాయింపులు ఆధారపడి ఉంటాయి. అయితే ఆదాయం, ఖర్చు చేసిన విధానంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలను కల్పించేదే స్టాండర్డ్‌ డిడక్షన్‌. జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులు, పెన్షనర్ల స్టాండర్డ్‌ డిడక్షన్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. దీని మకోసం ఆదాయం, ఖర్చులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ను మొదటిసారిగా 1974లో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్‌ 16 కింద ప్రవేశపెట్టారు. ఉద్యోగి ఆఫీసుకు వెళ్లి వచ్చేందుకు రవాణా ఖర్చులు, ఆరోగ్య, వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని, అప్పట్లో స్టాండర్డ్‌ డిడక్షన్‌ను ప్రవేశపెట్టారు. ఉద్యోగి స్థూల వేతనం నుంచి అనుమతించిన పరిమితి మేరకు ఈ ఖర్చులను తీసివేసి పన్ను లెక్కించేవారు. అయితే 2006-07 నుంచి ఈ విధానాన్ని రద్దు చేశారు. 12 ఏళ్ల తర్వాత అంటే 2018లో మళ్లీ స్టాండర్డ్‌ డిడక్షన్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం స్టాండర్డ్‌ డిడక్షన్ పరిమితి రూ.50వేలుగా ఉంది. దీని ప్రస్తుత బడ్జెట్‌లో 75 వేల రూపాయల వరకు పెంచవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో నెల రోజుల్లో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో ఈ అంశంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..