Telangana: జాబ్ రాలేదని కుంగిపోలేదు.. మామిడి తోటలో కోళ్లను పెంచుతూ లక్షలు

తను ఒక నిరుద్యోగి. తనతో పాటు పదిమందికి ఉపాధి కల్పించాలని సంకల్పించాడు. తన మెదడుకు పని పెట్టి స్వతహాగా డబ్బులు సంపాదించాలని మామిడి తోటలో జాతి కోళ్ల పెంపకం మొదలు పెట్టి తనతో పాటు ఐదుగురికి ఉపాధి కల్పిస్తూ నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ యువకుడు.

Telangana: జాబ్ రాలేదని కుంగిపోలేదు.. మామిడి తోటలో కోళ్లను పెంచుతూ లక్షలు
Country Cock Farm
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Apr 14, 2023 | 3:15 PM

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం.. స్టేషన్ గుండ్రాతిమడుగు గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. మంచి జాబ్ సంపాదించి తనతో పాటు తల్లితండ్రులను పోషించాలనుకున్నాడు. పలుమార్లు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా.. ఫలితం రాక విసిగి వేసారిపోయాడు. దీంతో రాజేష్ స్వతహాగా వ్యాపారం చేసి తనతో పాటు పది మందికి జీవనోపాది కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఊళ్ళో ఉన్నటువంటి మామిడి తోటను లీజుకు తీసుకొని తోటలో జాతి కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు.

కోళ్ల పెంపకం కోసం రెండు సంవత్సరాలలోనే 6 లక్షలు పెట్టుబడి పెట్టగా.. అతనికి చేతికి 15 లక్షలు రాబడి వచ్చింది. అంటే 2 ఏళ్లలో దాదాపు 10 లక్షల వరకు లాభం వచ్చిందనమాట. ఒక్కొక్క కోడిపిల్లను 12 నెలలపాటు పెంచేందుకు ఏడు వేల రూపాయల వరకు ఖర్చు వస్తుందని, పెంచాక వాటిని అమ్ముకుంటే ఒక్కో కోడిపై మూడు, నాలుగు వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందన్నారు. తనతో పాటు ఐదుగురికి జీవనోపాధి కల్పిస్తున్నానని ఆ యువకుడు తెలిపాడు. తను చదివిన చదువుకు కావాల్సిన ఉద్యోగం లభించకపోయినా నిరుత్సాహం చెందకుండా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెరు జాతితో పాటు ఆషిల్, కాకి, నెమలి, డేగ, పచ్చ కాకి, రసంగి, మైల,స్వేతంగి జాతులతో పాటు 15 రకాల జాతి కోళ్లను పెంచుతూ నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడి వద్ద కోళ్లను కొనుగోలు చేసేందుకు ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున కస్టమర్స్ వస్తున్నారు.

తనకు ప్రభుత్వం సహకరించి ఆర్థికంగా ప్రోత్సాహం కల్పిస్తే మరింత మందికి జీవనోపాధి కల్పిస్తానని యువకుడు రాజేష్ తెలిపారు.

Rajesh

Rajesh

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి