ఎంట్రన్స్ టెస్ట్ పాసైతేనే ఈ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్.. బెస్ట్ హై‌స్కూల్‌గా ఇప్పటికే గుర్తింపు.. దాని ప్రత్యేకతలు ఏమిటంటే..?

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 12, 2023 | 3:56 PM

Kurnool: కర్నూలుకు చెందిన ఆ ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాష్ట్ర స్థాయిలోనే తన సత్తా చాటింది. అత్యుత్తమ ఉన్నత పాఠశాలగా రికార్డులకు ఎక్కింది. ఈ క్రమంలోనే ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. విశేషమేమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బెస్ట్ హైస్కూల్‌గా రికార్డులకు ఎక్కడం ఆ స్కూల్‌కి ఇది రెండవసారి. ఇంకా గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ స్కూల్‌లో అడ్మిషన్ కావాలంటే తప్పనిసరిగా ఎంట్రన్ టెస్ట్ రాసి మెరిట్ సాధించాల్సిందే.. 

ఎంట్రన్స్ టెస్ట్ పాసైతేనే ఈ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్.. బెస్ట్ హై‌స్కూల్‌గా ఇప్పటికే గుర్తింపు.. దాని ప్రత్యేకతలు ఏమిటంటే..?
APJ Abdul Kalam Municipal Corporation High School, Kurnool
Follow us on

కర్నూల్, ఆగస్టు 12: భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఏపీజే అబ్దుల్ కలాంకు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎంతగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అలాంటి ఆయన పేరు మీద వెలసిన కర్నూల్‌లోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూడా అంతే స్థాయిలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తన సత్తాను చాటుతోంది. కర్నూలు నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్‌కి అరుదైన గౌరవం దక్కింది. 2022 – 23 విద్యా సంవత్సరానికి గానూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మున్సిపల్ యాజమాన్యం విభాగంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించింది. దీంతో ఈ మున్సిపల్ హైస్కూల్‌ని బెస్ట్ హైస్కూల్‌గా ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా ఈనెల 15న అమరావతిలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యేక సర్టిఫికెట్లను పొందనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా స్కూల్ హెడ్ మాస్టర్ విజయలక్ష్మి సర్టిఫికెట్లను మెమొంటోను అందుకోనున్నారు.

అయితే ఏపీలోనే బెస్ట్ హై స్కూల్‌గా ఎంపిక కావడం ఈ స్కూల్‌కి ఇది రెండవసారి. ఈ సారి కూడా పదవ తరగతి పరీక్షలలో రాష్ట్రస్థాయి ర్యాంకులు ఈ మున్సిపల్ హై స్కూల్ సొంతం అయ్యాయి. ఒక మున్సిపల్ హై స్కూల్‌కి రాష్ట్ర స్థాయి ర్యాంకులు రావడం అనేది ఇక్కడే జరుగుతుంది. గత ఏడాది ఫలితాల్లో సుశ్రిత 586 మార్కులతో, గౌతమ్ సాయి, సోఫియాన్ 580 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. 2016లో ఏర్పడిన ఫౌండేషన్ స్కూల్స్‌లో భాగంగా ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ హై స్కూల్ ఏర్పాటు అయింది. కర్నూల్లోని దామోదరం సంజీవయ్య మున్సిపల్ హై స్కూల్ ఆవరణలోనే ఈ ఫౌండేషన్ స్కూల్ కూడా ఏర్పాటు అయింది. అత్యుత్తమ విద్య బోధన క్రమశిక్షణ ఈ స్కూలుకి సొంతం.

ఇవి కూడా చదవండి

ఈ స్కూల్‌కి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో అడ్మిషన్ రావాలంటే ఎంట్రెన్స్ టెస్ట్‌లో మెరిట్ రావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రెన్స్ లేకుండా మెరిట్ లేకుండా అడ్మిషన్ రాదు. ప్రత్యేకంగా ఆరవ తరగతి అడ్మిషన్స్ కోసం ఈ పాఠశాల ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఈ టెస్టులో పూర్తి మెరిట్ ఆధారంగానే అడ్మిషన్ లభిస్తుంది. ఇందులో అడ్మిషన్ కోసం పిల్లలు పోటీ పడుతున్నారు. ఐఐటి స్థాయిలో పిల్లలకు కోచింగ్ ఇస్తూ పాఠశాల ఖ్యాతిని దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు ఈ పాఠశాలలోని అధ్యాపక బృందం. తమకు రెండవసారి ఈ అవార్డు దక్కడం పట్ల పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు తమ పాఠశాల సొంతం కావడం పట్ల హెడ్మాస్టర్ విజయలక్ష్మి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా బెస్ట్ మున్సిపల్ హైస్కూల్ అవార్డును తీసుకోనున్నట్లు గర్వంగా ఉందని తెలిపారు.