Andhra Pradesh: ఎమ్మెల్యే కొంపముంచిన అత్యుత్సాహం.. ఆ ఒక్క మాటతో జాడాపత్తా లేకుండా పోయారు!

| Edited By: Ravi Kiran

Mar 28, 2023 | 8:11 AM

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాలను రసకందాయంలో పడేశాయి. ఏడు ఎమ్మెల్సీలు గెలుస్తామని లెక్కలు వేసుకున్న అధికార పార్టీ ఆరింటికే పరిమితం అవ్వడం, తర్వాత రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తనకు 10 కోట్లు ఆఫర్ వచ్చిందన్న రాపాక, మరో అడుగు ముందుకు వేసి తాను దొంగ ఓట్లతోనే గెలిచానన్నారు.

Andhra Pradesh: ఎమ్మెల్యే కొంపముంచిన అత్యుత్సాహం.. ఆ ఒక్క మాటతో జాడాపత్తా లేకుండా పోయారు!
Rapaka Vara Prasad
Follow us on

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాలను రసకందాయంలో పడేశాయి. ఏడు ఎమ్మెల్సీలు గెలుస్తామని లెక్కలు వేసుకున్న అధికార పార్టీ ఆరింటికే పరిమితం అవ్వడం, తర్వాత రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తనకు 10 కోట్లు ఆఫర్ వచ్చిందన్న రాపాక, మరో అడుగు ముందుకు వేసి తాను దొంగ ఓట్లతోనే గెలిచానన్నారు. ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన రాపాక.. తనపై తానే బాంబు పేల్చుకున్నారు. సొంతూరు చింతలమోరులో పడిన దొంగ ఓట్ల గురించి ఆయనే చెప్పారు.

తన అనుచరులు ఒక్కొక్కరు పది చొప్పున ఓటేస్తేనే తనకు 800 ఓట్ల మెజారిటీ వచ్చిందన్నారు. ఈ వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. దొంగఓట్లతో గెలిచిన నీవు ఎమ్మెల్యే పదవికి అనర్హుడివి అంటూ ఆందోళనకు దిగారు. ఈ పరిణామాల అన్నింటి క్రమంలో రాపాక అజ్ఞాతంలోకి వెళ్లడం మరో చర్చకు దారితీసింది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అనుచరులకు అందుబాటులో లేకుండా వెళ్లారని ప్రచారం నడుస్తోంది. వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరో వైపు ప్రస్తుతం రాపాక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన ఎరక్కిపోయి ఇరుక్కున్నారా.. సొంత పార్టీ నేతలే ఇరికించారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం సఖినేటిపల్లి గ్రామంలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాపాక పాల్గొనాల్సి ఉంది.

అయినా ఎమెల్యే అందుబాటులో లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అధికారులు ఆ కార్యక్రమాన్ని తాత్కలికంగా వాయిదా వేశారు. రాపాక వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేయాలని జనసేన, వైసీపీ నేతలు సిద్ధమయ్యారు.. రాపాక చేతిలో ఓడిన టీడీపీ అభ్యర్థి దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. దీంతోనే రాపాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.. మిస్ అయ్యారని తెలుస్తోంది. మరి ఆయన ఎక్కడకు వెళ్లారు అన్నదానిపై ఇప్పటి వరకు ఆయన అనుచరులకు తెలియడం లేదు. మరి ఫిర్యాదు అందితే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..