ఇండియన్ ఎంబసీపై ఖలిస్థాన్‌ మద్దతుదారుల దాడికి యత్నం.. భగ్నం చేసిన సీక్రెట్‌ సర్వీస్‌.. భారతీయ జర్నలిస్ట్‌కు గాయాలు!

|

Mar 26, 2023 | 1:56 PM

Khalistan supporters: ఖలిస్థాన్‌ మద్దతుదారులు ప్రపంచ వ్యాప్తంగా రెచ్చిపోతున్నారు. లండన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు.. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో భారత రాయబారి కార్యాలయంపై దాడికి యత్నించారు.

ఇండియన్ ఎంబసీపై ఖలిస్థాన్‌ మద్దతుదారుల దాడికి యత్నం.. భగ్నం చేసిన సీక్రెట్‌ సర్వీస్‌.. భారతీయ జర్నలిస్ట్‌కు గాయాలు!
Indian Embassy In Washington
Follow us on

ఖలిస్థాన్‌ మద్దతుదారులు ప్రపంచ వ్యాప్తంగా రెచ్చిపోతున్నారు. లండన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు.. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో భారత రాయబారి కార్యాలయంపై దాడికి యత్నించారు. చివరి నిమిషంలో ఖలిస్థాన్‌ మద్దతుదారుల కుట్ర భగ్నమైంది. ముందుగానే అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌ దాడి జరగకుండా అడ్డుకుంది.

అమృత్ పాల్ సింగ్‌కు మద్దతుగా ఖలిస్థాన్ అనుకూల వర్గాలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఖలిస్తాన్ జెండాలు ఎగురవేసి అమెరికా సీక్రెట్ సర్వీస్ సమక్షంలో రాయబార కార్యాలయంపైకి దిగారు. ఇండియన్ ఎంబసీని ధ్వంసం చేస్తామని, భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధును బెదిరించారు. దౌత్యకార్యాలయంపై దాడికి దిగాలని ఖలిస్థానీ మద్దతుదారుల్లో కొందరు రెచ్చగొట్టారు. భవనం అద్దాలు పగలగొట్టాలని పిలుపునిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్నవారంతా దాడికి సిద్ధమయ్యారు.

పరిస్థితులు చేజారుతాయని ముందే ఊహించిన సీక్రెట్‌ సర్వీస్‌ బృందాలు, స్థానిక పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. దాదాపు మూడు వ్యాన్లలో ప్రత్యేక దళాలు భారత దౌత్యకార్యాలయానికి రక్షణగా నిలిచాయి. ఆ సమయంలో ఐదుగురు ఖలిస్థానీ సానుభూతిపరులు అక్కడే ఉన్న భారత పతాకాన్ని కిందకు దించబోగా.. భద్రతా సిబ్బంది అడ్డుకొన్నారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయితే ఎంబసీపై దాడికి ఖలిస్థానీ మద్దతుదారులు పెద్దసంఖ్యలో కర్రలు, ఇనుప రాడ్లను సమీపంలోని ఓ పార్క్‌లో భద్రపర్చినట్లు పోలీసులు గుర్తించారు..

అంతేకాదు విధి నిర్వహణలో ఉన్న భారతీయ జర్నలిస్ట్‌పై ఆందోళనకారులు దాడి కూడా చేశారు. నిరసనలపై రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో తనపై భౌతికంగా దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని జర్నలిస్టు లలిత్ ఝా ఆరోపించారు. ఇద్దరు సిక్కులు కర్రలు పట్టుకుని భారత ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని తీవ్రంగా దూషించిన వీడియోను ఝా షేర్ చేశారు. ఇద్దరు వ్యక్తులు తనను కర్రలతో కొట్టారని ఝా ఆరోపించారు. తన ప్రాణాలను కాపాడినందుకు, తన పని తాను చేసుకోవడానికి సహకరించిన సీక్రెట్ సర్వీస్ కు తన సోషల్ మీడియా ఖాతా పోస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు ఝా.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..