Telangana BRS Politics: తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ సైతం వ్యూహాలకు పదునుపెట్టింది. ఇవాళో, రేపో అభ్యర్థులను పేర్లను కూడా వెల్లడించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.. పేరు ఉంటుందో.. లేదో అంటూ చాలా మంది కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో అధినేత ఆశీస్సుల కోసం గుళ్ళు గోపురాలకు పరుగులు పెడుతున్నారు. టిక్కెట్ తమకే దక్కాలంటూ ప్రత్యేక పూజలు, యాగాలు చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. దేవుడా కనికరించు.. మాక్కు నువ్వే దిక్కంటూ మొక్కుకుంటున్నారు. ఈ పొలిటికల్ సీన్ వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజులపాటు వరంగల్ లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో రాజశ్యామల యాగం నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య… తనకు ఐదవసారి టిక్కెట్ దక్కాలని, కేసిఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు.. రాజయ్య నిర్వహించిన రాజ్యశ్యామల యాగం జనంలో ఆసక్తి కరమైన చర్చగా మారింది.
ఈ క్రమంలో తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పూజలు సైతం హాట్ హాట్ గా మారాయి.. ఆయన ఇష్టదైవం అయ్యప్పస్వామి సన్నిధి శబరిమలకు చేరుకున్న శంకర్ నాయక్ అయ్యప్ప స్వామి సన్నిధిలో పడిపూజ కార్యక్రమం నిర్వహించారు.. ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి సన్నిధిలో మొక్కుకున్నారు. మూడోసారి టికెట్ దక్కి హ్యాట్రిక్ విక్టరీ సాధించాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. అదేవిధంగా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇలా టికెట్ల కోసం గుళ్ళు గోపురాలపైపు పరుగులు పెట్టడం ఇప్పుడు జనంలో చర్చగా మారింది.. సాధారణంగా టికెట్ దక్కిన తర్వాత గెలుపు కోసం వెళ్లడం కామన్.. కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించడం చూస్తుంటాం.. కానీ ఈ నేతలు టికెట్ దక్కితేచాలు అన్నట్లుగా టికెట్ కోసం పడరాన్ని పాట్లు పడుతుండడం చూసి అటు ప్రజలు.. ఇటు నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు..
ఈ క్రమంలో మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు ఎదుర్కొన్న ఈ నేతలు.. అధినేత చేత చివాట్లు తిన్నారు.. ఇప్పుడు టికెట్ కోసం దేవుడు పై భారం వేసి దేవుడా నువ్వే దిక్కనడం చూసి జనం రకరకాలుగా చెవులు కోరుక్కుంటారు.. దేవాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న వీరికి అధినేత ఆశీస్సులు ఉంటాయా..? పూజలు ఫలిస్తాయా…? చివరకు టిక్కెట్ లభిస్తుందా..? లేదా అనేది వేచి చూడాల్సిందే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..