హైదరాబాద్ టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి వేదిక కానుంది. టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దివంగత నేత , మహా నటుడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అయితే మార్చి 29తో టీడీపీ 40 వసంతాలు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల టీడీపీ నేతలతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.
ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు వెళ్లే ముందు చంద్రబాబుతో పాటు ఇతర నేతలు ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవ నినాదంతో పుట్టి, తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్ అని అన్నారు. ఆవిర్భావ దినోత్సవం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో సైతం ఘనంగా నిర్వహించారు. పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం వాషింగ్టన్ డీసీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే తెలంగాణలో కనుమరుగవుతున్న పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చేందుకు నేతలు కృషి చేస్తున్నారు. ఏపీలో ప్రతిపక్షపార్టీగా ఉన్న టీడీపీ.. అక్కడ వచ్చే ఎన్నికల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ మరింత బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి