మనదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని ఓ ఆటగా కాకుండా ఎమోషనల్ గా భావిస్తారు చాలామంది ఫ్యాన్స్. అందుకే ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా అభిమానులతో నిండిపోతుంటాయి గ్రౌండ్స్. అయితే దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి. దీంతో క్రికెట్ ఆడడానికి మైదానాల్లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు యువత. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో ఉన్న కొన్ని ప్రధాన, పెద్ద ఫ్లై ఓవర్ల కింద బాక్స్ క్రికెట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నవీ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్నంగా ఆలోచించి.. ఫ్లైఓవర్ కింద బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ధనుంజయ్ అనే యువకుడు ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘ఇది అద్భుతమైన ఆలోచన.. నవీ ముంబైలో ఫ్లై ఓవర్ల కింద ఆట స్థలాలను నిర్మించినట్లు అన్ని పట్టణాల్లోని ఫ్లై ఓవర్ల కింద ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మీ పట్టణాల్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ‘ అని నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది. ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ ఐడియాపై ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ వీడియోపై స్పందించారు. ఇది మంచి ఆలోచన అని మంత్రి సైతం ఈ వీడియోను షేర్ చేశారు. ఈ విధానాన్ని పరిశీలించాలని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్‌కు సూచించారు. జంట నగరాల్లో ఈ తరహా క్రీడా వేదికలను అందుబాటులోకి తీసుకురావొచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ ఆలోచన ఆచరణలోకి వచ్చి ఫ్లైఓవర్ల కింద క్రికెట్ బాక్స్ లను ఏర్పాటు చేయడం వల్ల యువతకు మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని నగర వాసులు భావిస్తున్నారు.
Let’s get this done in a few places in Hyderabad @arvindkumar_ias
Looks like a nice idea https://t.co/o0CVTaYxqb
— KTR (@KTRBRS) March 27, 2023
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం.. క్లిక్ చేయండి