KL Rahul: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టు, జనవరి నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 3, మంగళవారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఈ సిరీస్ కోసం భారత జట్టు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పై కత్తి వేలాడుతోంది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు ఈ స్టార్ ప్లేయర్‌ను తప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కేఎల్ రాహుల్ నిరంతర పేలవ ప్రదర్శన అతనికి సమస్యగా మారవచ్చు. ఇటీవల ఆడిన టెస్టు సిరీస్‌లో కూడా రాహుల్ విఫలమయ్యాడు. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అతని సగటు 30కి మించలేదు. అతడి ఆటతీరు చూస్తుంటే జట్టు నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్‌కు బదులుగా స్టార్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అతను డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో రాహుల్ 4 మ్యాచ్‌లు ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 17.12 సగటుతో 137 పరుగులు చేశాడు. ఇందులో అతను ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించాడు. అదే సమయంలో, 10 వన్డేలలో 9 ఇన్నింగ్స్‌లలో, అతను 27.88 సగటుతో 251 పరుగులు చేశాడు. ఇందులో అతని బ్యాట్ నుంచి కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే వచ్చాయి. ఇది కాకుండా, T20 ఇంటర్నేషనల్‌లో, అతను 16 మ్యాచ్‌లలో 28.93 సగటు, 126.53 స్ట్రైక్ రేట్‌తో 434 పరుగులు చేశాడు. ఇందులో అతను 6 అర్ధ సెంచరీలు సాధించాడు.
రాహుల్ సారథ్యంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత జట్టు 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో భారత జట్టు విజయం సాధించింది. కానీ, టీమిండియా వన్డే సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..