IND vs SL: అవి బంతులు కాదు బుల్లెట్లు.. టీమిండియా స్పీడ్‌స్టర్‌ దెబ్బకు గాల్లో ఎగిరిన వికెట్లు.. లంకేయుల బిక్కమొహం

|

Jan 06, 2023 | 7:58 AM

ముంబైలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గంటకు 155 కి.మీల వేగంతో బంతులేసి రికార్డు సృష్టించిన ఉమ్రాన్.. రెండో మ్యాచ్‌లోనూ తన పేస్‌ అటాక్‌తో శ్రీలంక బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టాడు. ఈసారి 155 కి.మీల స్పీడ్‌ని టచ్ చేయకపోయినా వరుస విరామాల్లో వికెట్లు తీశాడు.

IND vs SL: అవి బంతులు కాదు బుల్లెట్లు.. టీమిండియా స్పీడ్‌స్టర్‌ దెబ్బకు గాల్లో ఎగిరిన వికెట్లు.. లంకేయుల బిక్కమొహం
Umran Malik
Follow us on

బౌలర్ల తీసికట్టు ప్రదర్శన, పేలవమైన బ్యాటింగ్ కారణంగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. పుణె వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోగా, ఆతర్వాత బ్యాటర్లు సులువుగా వికెట్లు పారేసుకున్నారు. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ అర్ధసెంచరీలు మినహా మరెవరూ పెద్దగా రాణించకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కాగా ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రదర్శన మరోసారి నిరాశపర్చింది. అక్షర్‌, చాహల్‌ తప్ప అందరూ భారీగా పరుగులు ఇచ్చారు. అయితే ఎప్పటిలాగే ఈ మ్యాచ్‌లో తన పేస్‌ అటాక్‌తో లంకేయులకు చుక్కలు చూపించాడు స్పీడ్‌ స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌. భారీగా పరుగులు ఇచ్చినా కీలక వికెట్లు తీసి పర్యాటక జట్టు మరింత భారీస్కోరు చేయకుండా కట్టడి చేశాడు. ముంబైలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గంటకు 155 కి.మీల వేగంతో బంతులేసి రికార్డు సృష్టించిన ఉమ్రాన్.. రెండో మ్యాచ్‌లోనూ తన పేస్‌ అటాక్‌తో శ్రీలంక బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టాడు. ఈసారి 155 కి.మీల స్పీడ్‌ని టచ్ చేయకపోయినా వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. MCA స్టేడియంలో జరిగిన రెండో T20 మ్యాచ్‌లో, ఉమ్రాన్ మాలిక్ తన మొదటి ఓవర్‌లో 13 పరుగులు ఇచ్చాడు. అయితే రెండో ఓవర్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. 10వ ఓవర్‌లో, ఉమ్రాన్ తన మొదటి బంతికి శ్రీలంక ఎడమచేతి వాటం బ్యాటర్‌ భానుక రాజపక్సే స్టంప్‌లను ఎగరగొట్టాడు. రౌండ్ ది వికెట్‌తో 147 కిలోమీటలర్ల వేగంతో విసిరిన బంతికి రాజపక్సే దగ్గర సమాధానం లేకపోయింది. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్లను గిరాటేసింది.

హసరంగ దిమ్మతిరిగింది..

ఉమ్రాన్ అక్కడితో ఆగలేదు ఆ తర్వాతి ఓవర్‌లో మరింత చెలరేగాడు. ఒక చక్కటి బంతితో చరిత్ అసలంకను ఔట్‌ చేసిన ఈ స్పీడ్‌ స్టర్ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాణిందు హసరంగకు దిమ్మ తిరిగే బాల్‌ను సంధించాడు. దెబ్బకు లంక ఆల్‌రౌండర్‌ ఆఫ్‌ స్టంప్‌ గాలిలో ఎగిరిపోయింది. అయితే, ఉమ్రాన్ తన చివరి ఓవర్లో హ్యాట్రిక్ పూర్తి చేయలేకపోయాడు. దసున్ శంక ఆ ఓవర్ తొలి బంతినే ఫోర్‌కి పంపాడు. ఆ తర్వాతి బంతికి వికెట్ వెనుక సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మరో సిక్స్ రావడంతో లంక భారీ స్కోరు చేయగలిగింది. అయితే బ్యాటర్లకు స్వర్గధామంగా ఉన్న పిచ్‌పై ఉమ్రాన్ 4 ఓవర్లలో 48 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..