Mahashivratri: మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాల్లో క్యూ కట్టారు. లింగ రూపంలో ఉన్న శివుడిని దర్శించుకుంటున్నారు. శ్రీశైలంలోని మల్లిఖార్జునస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మరోవైపు, శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గజవాహనంపై భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి గ్రామోత్సవం జరిగింది.
అటు, శ్రీకాళహస్తి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు నిన్న మంత్రి పెద్దిరెడ్డి కాళహస్తి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మూడు రోజుల పాటు వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ వేములవాడకు దాదాపు 4 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.
అటు, మహాశివరాత్రి సందర్భంగా జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని శంకరాచార్య ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో ముస్తాబైంది. సముద్రమట్టం నుండి అత్యంత ఎత్తులో ఉన్న ఈ ఆలయం ఏరియల్ వ్యూ డ్రోన్ కెమెరా వీడియో లతో అద్భుతంగా దర్శనమిస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా పుణ్యస్నానాలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం 11గంటలకు జూనా అఖాడా, ఆహ్వాన్ అఖాడా, అగ్ని అఖాడా, కిన్నర్ అఖాడాలు ఇక్కడ స్నానం చేసేందుకు తరలిరానున్నారు. వీరి తరువాత ఆనంద్ అఖాడాలు మధ్యాహ్నం ఒంటిగంటకు రానున్నారు. అనంతరం మహానిర్వాణీ అఖాడా, అటల్ అఖాడాలు ఇక్కడికి పుణ్య స్నానాలు చేసేందుకు తరలిరానున్నారు. నాగా సాధువులు ఉదయం 7 గంటలకు స్నానం చేయనున్నారు.
అలాగే, పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారీగా తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పడు ఘాట్లను పరిశుభ్రపరిచేలా చర్యలు చేపట్టారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు లెక్కకుమించి భక్తులు రానున్న దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేసి ప్రత్యేక పర్యవేక్షకులను నియమించారు. అలాగే, భక్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు.