Telangana BJP: ఓవైపు కార్యాచరణ.. ఇంకోవైపు అభ్యర్థుల ఎంపిక.. ఆపరేషన్ ఆకర్ష.. దూకుడు పెంచిన బీజేపీ

| Edited By: Ravi Kiran

Jul 24, 2023 | 9:21 PM

మొన్నటి వరకు కాస్త నెమ్మదించిన కాషాయదళం ఇపుడు స్పీడు పెంచినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని చాటే యత్నాలను ముమ్మరం చేసింది.

Telangana BJP: ఓవైపు కార్యాచరణ.. ఇంకోవైపు అభ్యర్థుల ఎంపిక.. ఆపరేషన్ ఆకర్ష.. దూకుడు పెంచిన బీజేపీ
Bjp
Follow us on

మొన్నటి వరకు కాస్త నెమ్మదించిన కాషాయదళం ఇపుడు స్పీడు పెంచినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని చాటే యత్నాలను ముమ్మరం చేసింది. అందుకు పార్లమెంటులో ఆ రెండు పార్టీలు దాదాపు కలిసి పని చేస్తున్నట్లుగా సాక్ష్యాలను చూపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దాకానే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రత్యర్థులుగా నటిస్తాయని, ఆ తర్వాత కన్వీనియెంట్‌గా కలిసి పోతాయని కమల నాథులు చెబుతున్నారు. దానికి తోడు ఆపరేషన్ ఆకర్ష్‌ని వేగవంతం చేసేందుకు కూడా బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. దీనికి అనుగుణంగా శ్రావణ మాసంలో బీజేపీలోకి చేరికలుంటాయని, ఏకంగా 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని ప్రచారం చేసుకుంటున్నారు. ఈప్రచారంలో వాస్తవమెంతుందో కానీ.. బీజేపీ ఎన్నికల కసరత్తు వేగవంతమైందని మాత్రం చెప్పవచ్చు. ఎన్నికలకు రెడీ అవుతున్న బీజేపీ ఓవైపు ప్రజలను ప్రభావితం చేసే కార్యాచరణను అమలు చేస్తూనే ఇంకోవైపు అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు ప్రారంభించిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాల జాబితాను బీజేపీ యంత్రాంగం రెడీ చేస్తోన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ నియోజకవర్గాలలో ముందుగానే టికెట్లు ప్రకటిస్తే బెటరని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు రెండో వారంలో 119 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేల ప్రకటించాలని బీజేపీ యోచిస్తుందని, ఈ అభ్యర్థులంతా వారం పాటు నియోజక వర్గాల్లో మకాం వేయించేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో దాదాపు అన్ని పార్టీలు అలర్టవుతున్నాయి. ప్రధానంగా టీ.బీజేపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. దీనిపై పార్టీలో పెద్ద కసరత్తే జరుగుతోందని వారంటున్నారు. టికెట్లు ఆశించే నాయకులు కూడా ముందుగానే తమ పేర్లను ప్రకటించాలని కోరుతున్నారు. ముందుగానే టికెట్లు కేటాయిస్తే బెటర్ అని ఆశావాహలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అధిష్టానం నియోజకవర్గా ల వారీగా అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తోందని సమాచారం.

అతి త్వరలోనే తెలంగాణ రాష్ర్టంలోని 119 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది బీజేపీ హైకమాండ్. ఇప్పటికే రాష్ర్టంలో ఎన్నికల వాతావరణం క్రియేట్ చేస్తోంది. మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగానే రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు తెలంగాణకు రెగ్యులర్‌గా వస్తున్నారు. ఓవైపు ఎన్నికల హడావుడిని క్రియేట్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలను పంపిస్తున్నారు. అయితే.. ఈ మధ్య రాష్ర్ట అధ్యక్షుడి మార్పుతో పాటు.. పార్టీలో నెలకొన్న అనిశ్చితి.. నాయకుల మధ్య విబేధాలు కొంత పార్టీని ఇబ్బంది పెట్టాయి. అంతేకాదు.. పార్టీ క్యాడర్ లో జోష్ ను తగ్గించింది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ హైకమాండ్ తెలంగాణపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 119 నియోజకవర్గాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా షాడో టీమ్ ఇదివరకే పర్యటించినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు సార్లు సర్వేలు చేయించారని చెబుతున్నారు. ఆ రిపోర్టులు కూడా బీజేపీ అధిష్టానం వద్దకు ఆల్ రెడీ చేరిపోయాయని తెలుస్తోంది. తెలంగాణ సామాన్య ప్రజానీకం బీజేపీ గురించి ఏమనుకుంటున్నారు? ఓటరు నాడి ఎలా ఉంది? రాష్ర్ట ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? కేంద్ర అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. లేదా? ప్రభుత్వ తీరుపై ప్రజల ఓపీనియన్ కు సంబంధించిన సర్వే రిపోర్టులు బీజేపీ అధిష్టానం వద్దకు చేరాయి. ఈ రిపోర్టు ఆధారంగా కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. సంస్థాగతంగా చేయాల్సిన పనులు చాలా వున్నాయన్న రీజన్ వల్లే జులై 29న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా సభను ఏర్పాటు చేసి ఖమ్మంలో సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముందుగా తలపెట్టింది. కానీ తాజాగా ఖమ్మం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మంకు బదులుగా అమిత్ షా హైదరాబాద్ వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ వేదికగా బీజేపీ సంస్థాగత అంశాలపై అమిత్ షా సమీక్ష జరుపుతారని, పార్టీ వివిధ విభాగాలలో భేటీ అవుతారని తెలుస్తోంది. ఎన్నికల సన్నాహాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, దానికి అనుగుణంగా పార్టీ యంత్రాంగాన్ని దారిలో పెట్టాలని అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా పర్యటను ఖరారు చేయడంతోపాటు ఆయన వివిధ మోర్చాలతో భేటీ అయ్యే షెడ్యూలుని ఖరారు చేసేందుకు జులై 26న రాష్ట్ర కీలక నేతలు భేటీ కానున్నారు.

ఆగష్టు రెండోవారంలో బీజేపీ జాతీయ నేతలు, కేంద్రమంత్రులు తెలంగాణకు పెద్ద ఎత్తున వస్తున్నట్లు తెలుస్తోంది. వారంతా వారం రోజుల పాటు నియోజకవర్గాల్లోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. 119 నియోజకవర్గాల్లో జాతీయ నాయకులు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. వారంతా పార్టీ బలోపేతం కోసం కృషి చేయనున్నారు. పార్టీ ఏ నియోజకవర్గంలో వీక్ ఉంది..? బలోపేతం కావాలంటే ఏం చేయాలి…? వంటి సలహాలు, సూచనలు లోకల్ లీడర్లు, టికెట్లు ఆశించే వారికి చెప్పనున్నారు. ఇదే రిపోర్టులను అధిష్టానానికి కూడా పంపించనున్నారు. మరోవైపు.. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారు చాలా యాక్టివ్‌గా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు.తాజాగా డబుల్ బెడ్ రూం ఇళ్ళ సందర్శన కోసం చలో బాట సింగారం కార్యక్రమానికి కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిస్తే బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా హంగామా చేశాయి. కిషన్ రెడ్డి అరెస్టు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గళమెత్తాయి. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జులై 24న తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, బూర నర్సయ్య గౌడ్ వంటివారంతా పాల్గొన్నారు. మరోవైపు మహిళా సంఘాలు, యువజన సంఘాలతో బీజేపీ నేతలు తరచూ భేటీ అవుతున్నారు. పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యాచరణపై సీరియస్ గా ఫోకస్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నాయకులకు ముందుగానే టికెట్లు కేటాయించాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే.. బీజేపీలో మాత్రం అంత ఈజీగా టికెట్లు ఖరారు చేయరు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తమ్మీద కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు రెండు నెలలపాటు స్తబ్ధుగా వుండిపోయిన కమలనాథుల్లో ఇపుడు కదనోత్సాహం కనిపిస్తోంది. అయితే ఇది బలుపా ? లేక వాపా? అన్నది త్వరలోనే తేలిపోనున్నది.