Telangana: పథకం పాతదే.. కానీ రాజకీయ రచ్చ ఇపుడు జనరంజకం.. ఎవరూ కాదనలేని సూపర్ సంక్షేమ స్కీమ్

|

Jul 14, 2023 | 4:15 PM

1999 ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ఆర్.. ఆనాడు నివాసమున్న బంజారాహిల్స్ ‘శ్రీభాగ్’ భవన సన్నిధిలో తీవ్ర స్థాయిలో వివశులై వున్న సమయంలో .. ‘‘మనకింకా సమయముంది మిత్రమా’’

Telangana: పథకం పాతదే.. కానీ రాజకీయ రచ్చ ఇపుడు జనరంజకం.. ఎవరూ కాదనలేని సూపర్ సంక్షేమ స్కీమ్
Follow us on

హైదరాబాద్, జూలై 13: ఉచిత విద్యుత్… వైఎస్ రాజశేఖర్ రెడ్డి మదిలో మెదిలిన రెండు కీలక ప్రజా సంక్షేమ పథకాలలో ఇది ఒకటి. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తానే విజేతనని గట్టిగా అనుకుని, భంగ పడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. తన సన్నిహితుల హితబోధతో కోలుకుని ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల దాకా ఓ వ్యూహాత్మక పంథాను అనుసరించాలనుకున్న క్రమంలో 1999-2004 మధ్య వెలుగులోకి వచ్చిన పథకం. 1999 ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ఆర్.. ఆనాడు నివాసమున్న బంజారాహిల్స్ ‘శ్రీభాగ్’ భవన సన్నిధిలో తీవ్ర స్థాయిలో వివశులై వున్న సమయంలో .. ‘‘మనకింకా సమయముంది మిత్రమా’’ అన్న తన అనుంగు సహచరుడు కెప్టెన్ డా. కేవీపీ రామచంద్రరావు స్పూర్తితో ప్రతిపక్ష నేతగా తన పంథాను మార్చుకున్న సమయంలో పుట్టిన ద గ్రేటెస్ట్ స్కీమ్… ‘‘ వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్’’. అన్నట్లుగానే 2004 ఎన్నికల్లో విజయం సాధించిన తరుణంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం చేసిన ద గ్రేటెస్ట్ ప్రజారంజక పథకమది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో లక్షలాది మంది పేద రైతులకు ఎంతో ఊరట నిచ్చిన పథకం ‘‘ ఉచిత విద్యుత్’’. వైఎస్ఆర్ సెప్టెంబర్ 2న (2009) హఠాన్మరణం చెందిన తర్వాత ఉచిత విద్యుత్ పథకం అనివార్యంగా కొనసాగించాల్సిన అవసరం ఆ తర్వాత పాలకులపై పడింది. నదిలో విసిరేసినా ప్రతీ పైసా లెక్కించాల్సిందేనని తరచూ చెప్పే కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రి అయినా.. బెంగళూరు కేంద్రంగా స్పీకర్ నంటూ చక్రం తిప్పి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొనసాగించిన జనరంజక పథకం ఉచిత విద్యుత్.

ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి. తాజాగా తెలంగాణ రాష్ట్రం మరోసారి అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో రాజకీయ దుమారానికి కారణమైంది ఉచిత విద్యుత్ పథకం. అమెరికా పర్యటనకు వెళ్ళిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అక్కడ యథాలాపంగా చేసిన వ్యాఖ్య తెలంగాణలో రాజకీయ దుమారానికి దారి తీసింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదన్న సారాంశంతో రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. రోజులో 3 గంటల పాటు విద్యుత్ ఇస్తే చాలు వ్యవసాయ రంగానికి అంటూ వివరించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. కానీ ఈ కామెంట్ల సారాంశం బూమరాంగ్ అయ్యింది. ఒరిజినల్‌గా ఆలోచిస్తే వ్యవసాయదారులు విద్యుత్‌ని రోజులో కొన్ని గంటల పాటే వినియోగిస్తారు. కానీ కేవలం నిర్దేశిత గంటల వ్యవధిలోనే విద్యుత్ సరఫరా వుంటుందని చెబితే ఆ సమయంలో రైతులందరూ విద్యుత్ వినియోగానికి ప్రయత్నిస్తారు. దాంతో విద్యుత్ వినియోగం పీక్ లెవల్‌కి చేరి సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం వుంటుంది. అందుకోసమే.. 24 గంటలూ ఉచిత విద్యుత్ అవసరం వుంటుందని ప్రకటిస్తే.. రైతులు తమకు వీలైనపుడు వ్యవసాయ పంపులను వాడుకుంటారు. దాంతో పీక్ అవర్ ప్రెషర్ వుండదు. ఈ విషయం అధికారులకు, రాజకీయ నాయకులకు బాగా తెలుసు. కానీ రైతులు సగటున విద్యుత్ వాడుకునే సమయాన్ని వెల్లడించే క్రమంలో 3, 4 గంటల పాటు రైతులకు విద్యుత్ చాలన్నది బహిరంగంగా వెల్లడించలేని పరిస్థితి. కానీ దీనిని క్లారిటీతో వెల్లడించే విషయంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. అది కాస్తా తెలంగాణలో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితికి కలిసి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించే అవకాశం గులాబీ శ్రేణులకు దక్కింది. పక్కా రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ విధానాలను బీఆర్ఎస్ నేతలు తమ ప్రసంగాలలో బాగానే ఎండగట్టారు కూడా.

ఉచిత విద్యుత్ పథకానికి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి. అలాగే విద్యుత్ సంస్కరణల విషయంలో కేంద్రం ఏమైనా చెబితే దానిని రాజకీయంగా వాడుకునే పరిస్థితి. ఉచితంగా ఇస్తున్నా కూడా ఏ స్థాయిలో విద్యుత్ వ్యవసాయ రంగానికి ఉచితంగా ఇస్తున్నామో తెలియాలంటూ మీటర్లను బిగించాలని కేంద్రం సూచిస్తోంది.  ఇక్కడ దివంగత నేత రోశయ్య తరచూ చెప్పే ఓ కామెంట్ ప్రస్తావించాలి. గోదావరి, కృష్ణా వంటి నదులను దాటుతున్న క్రమంలో అందులో వేసే నాణేలను కూడా లెక్కేసి వేయాలని రోశయ్య తరచూ అనేవారు. అంటే ఉచితంగా ఇచ్చే దానాలను కూడా లెక్కించి వేయాలన్నది ఆయన ఉద్దేశం సరిగ్గా ఇలాంటి విధానంతోనే వ్యవసాయ రంగానికి విద్యుత్ ఏ మేరకు సరఫరా అవుతుందన్నది లెక్కించాలి. కానీ దీనిని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. వ్యవసాయం చేసే వారిలో పేద రైతులున్నారు. ధనిక రైతులూ వున్నారు. పదుల సంఖ్యలో ఎకరాల భూమిలో వ్యవసాయం చేసే వారిని పేద రైతులుగా పరిగణించలేం. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాప్రతినిధులుగా వున్న చాలా  మంది.. వ్యవసాయం చేస్తున్నామంటూ కోట్ల రూపాయల రైతు బంధు నిధులను పొందుతున్నారు. మంత్రులుగా కోట్లకు పడగలెత్తిన వారు కూడా ప్రభుత్వం నుంచి రైతు బంధు నిధులను కాజేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ధనిక రైతులకు కూడా ప్రభుత్వం ఉచితంగా నిధులను ఇస్తుందన్నమాట. పేద రైతులకు సాయం చేయడం అవసరమే. కానీ పదుల సంఖ్య నుంచి వేల సంఖ్యలో భూకమతాలున్న వారికి కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయం చేయడం అవసరమా? అంటే కాదనే వారే అధికం.

ఉచిత విద్యత్ పథకం విషయంలోను ఇదే సూత్రం వర్తిస్తుందన్నది ఇపుడు చర్చనీయాంశం. బహుశా ఈ అంశాన్ని వివరించే క్రమంలోనే రేవంత్ రెడ్డి మాటలను తడబడ్డారేమో. అది కాస్తా అధికార బీఆర్ఎస్ నాయకులకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ పథకానికి వ్యతిరేకమంటూ ఉద్యమానికి దారి తీసింది. ఉచిత విద్యుత్ పథకం విషయంలో భారతీయ జనతా పార్టీ జాగ్రత్తగానే వుంది. ఎలాంటి ప్రకటనలూ చేయకుండా మేటర్ మీరు తేల్చుకోడంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వదిలేసింది. కాంగ్రెస్ వాదన ఎలా వున్నా.. బీఆర్ఎస్ నేతల విధానం ఎలా వున్నా.. ఫ్రీ బీస్ ఇవ్వడం అలవాటు పడ్డ పార్టీలకు, తీసుకోవడం అలవాటు పడిన ప్రజలకు ఉచిత విద్యుత్ అంశం కొన్నాళ్ళ పాటు కీలకమే. ఇంకా చెప్పాలంటే ప్రజలకు క్లారిటీ చెప్పలేకపోయినా లేక ఎన్నికల్లో ఉచిత విద్యుత్ అంశాన్ని రాజకీయంగా వాడుకుందామని పార్టీలు ఎత్తు వేసినా 2023 అసెంబ్లీ ఎన్నికలో ఇదే కీలకాంశం కాక మానదు.