National Politics: కూటమి కూర్పులో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు.. ప్రతి వ్యూహంతో ఎదురు దాడికి మోదీ శ్రీకారం

|

Mar 29, 2023 | 4:15 PM

కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఇప్పటికే తమ వైపున వున్న పార్టీలను కాపాడుకుంటూనే కొత్త పార్టీలను అక్కున చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. దానికి రాహుల్ గాంధీ అనర్హత అంశం బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది.

National Politics: కూటమి కూర్పులో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు.. ప్రతి వ్యూహంతో ఎదురు దాడికి మోదీ శ్రీకారం
Congress Vs Bjp
Follow us on

అదానీ సంస్థల ఆర్థిక పతనం, రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. గత పది రోజులుగా దేశాన్ని రగిలింప చేస్తున్న అంశాలు. ఈ రెండంశాలే ఇపుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల దిశగా బీజేపీని వ్యతిరేకించే పార్టీలనన్నింటిని ఒక గొడుగు కిందికి తీసుకురాబోయేవిగా కనిపిస్తున్నాయి. అదానీ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడం ద్వారా ఉభయ సభలను కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు అడ్డుకుంటున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పట్నించి పార్లమెంటు సజావుగా సాగింది లేదు. అదానీ అంశంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసిన పార్టీలు చాలా కాలంగా ఆ పార్టీతో కలిసి నడుస్తున్నవే. అదనంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి ఇపుడు జత కలిసింది. ఎప్పుడైతే అదానీ అంశానికి రాహుల్ గాంధీ అనర్హత అంశం జత కలిసిందో.. అప్పుడు ఎంతో కొంత దూరం పాటిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో జత కలిశాయి. అంతకు ముందు కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి కూర్పు కోసం పని చేస్తున్నట్లు కనిపించిన టీఎంసీ, బీఆర్ఎస్.. తాజాగా కాంగ్రెస్ పార్టీతో కలిసి మోదీ సర్కార్‌పై పోరుకు అడుగులు కలిపాయి. ఇప్పటికిప్పుడున్న రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే రెండు, మూడు చిన్నా చితకా పార్టీలు మినహా మెజారిటీ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ సారథ్యంలో పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదానీ వ్యవహారంపై పార్లమెంటు వేదికగా ఆందోళనకు శ్రీకారం చుట్టిన సందర్భంలో 17 పార్టీలు కాంగ్రెస్ పార్టీ వెన్నంటి నడిచాయి. రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశం కూడా జత కల్వడంతో ఇపుడు ఆ పార్టీతో కలిసి నడుస్తున్న పార్టీల సంఖ్య 19కి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఇప్పటికే తమ వైపున వున్న పార్టీలను కాపాడుకుంటూనే కొత్త పార్టీలను అక్కున చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. దానికి రాహుల్ గాంధీ అనర్హత అంశం బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. కారణాలేవైతేనేం రాహుల్ గాంధీపై పడిన అనర్హత వేటు చాలా పార్టీలను అభద్రతాభావంలో పడేసినట్లు కనిపిస్తోంది. మోదీ సర్కార్ ఇదే దూకుడుతో ముందుకు వెళితే భవిష్యత్తులో తమకూ ఇబ్బందులు తప్పవని భావిస్తున్న రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమతమ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రత్యర్థులుగా వున్నప్పటికీ దానిని పక్కన పెట్టి రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ పార్టీలు మెల్లిగా తమకు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలుగా మారుతున్నాయి. తెలంగాణ వంటి చోట్ల స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలతో కస్సుబుస్సు అంటున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో కలిసి చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

మిత్రపక్షాలను కలుపుకుని కొత్త వ్యూహం

తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ విపక్షాల కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ముందు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నిజానికి క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన సందర్భంలో రాహుల్ గాంధీ వాడిన పదజాలం గత నాలుగేళ్ళుగా కలిసి వున్న మహా వికాస్ అఘాడీలో చిచ్చు పెట్టినట్లే కనిపించింది. ‘‘ తాను సావర్కర్‌ని కాదని.. గాంధీనని.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు ’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు మిత్రపక్షానికి ఇబ్బంది కలిగించాయి. వీర సావర్కర్ మహారాస్ట్రియన్ కావడంతో శివసేన పార్టీ ఆయన్ని ఆరాధిస్తుంది. తాము ఆరాధించే సావర్కర్‌ని రాహుల్ తక్కువ చేసి మాట్లాడడం శివసేన (ఉద్ధవ్ వర్గం)కు నచ్చలేదు. దాంతో మార్చి 27 రాత్రి మిత్రపక్షాల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విందుకు ఉద్దవ్ థాక్రే బృందం గైర్హాజరైంది. ఉద్దవ్ థాక్రేతోపాటు ఆ పార్టీకి చెందిన సంజయ్ రౌత్ కూడా రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. విందుకు ఉద్దవ్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహిత పార్టీ, మహా వికాస్ అఘాడీలో భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రంగంలోకి దిగారు. మార్చి 28న అటు రాహుల్ గాంధీకి, ఇటు ఉద్ధవ్ థాక్రేకు నచ్చ చెప్పారు. దాంతో సావర్కర్ అంశంపై రాహల్ గాంధీ వెనక్కి తగ్గారు. ఫలితంగా శివసేన (ఉద్ధవ్ వర్గం) దిగి వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయించింది. అయితే, రాహుల్ గాంధీ తాను సావర్కర్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. భవిష్యత్తులో మాత్రం సావర్కర్‌పై వ్యాఖ్యలు చేయబోనని మాత్రం ఉద్దవ్ థాక్రేకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. వీర సావర్కర్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాదని, మహారాష్ట్రకు చెందిన దేశభక్తుడని శివసేన చెప్పుకుంటుంది. ఈక్రమంలో మిత్ర పక్షాలను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని శరద్ పవార్ సూచించడంతోనే రాహుల్ గాంధీ ఉద్ధవ్ థాక్రేకి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 28వ తేదీన జరిగిన భాగస్వామ్య పక్షాల భేటీలో కాంగ్రెస్ నాయకత్వం ఇదే అంశాన్ని వెల్లడించింది. మిత్రపక్షాలను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయబోమని, మిత్రుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటామని కాంగ్రెస్ అధినేతలు ప్రకటించడంతో ఉద్ధవ్ థాక్రే మెత్తబడినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో పెరిగిన విశ్వాసం

పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని 19 పార్టీల కూటమి తమ వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకపోవడంతో ఇక రాహుల్ అనర్హత అంశాన్ని జనం మధ్యకు తీసుకువెళ్ళాలని 19 పార్టీల కూటమి నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే నెల రోజుల పాటు విపక్షాల కూటమి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. జై భారత్ మహా సత్యగ్రహ.. ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీలు ప్లాన్ చేస్తోంది విపక్ష కూటమి. దేశవ్యాప్తంగా కాగడాల ర్యాలీలు నిర్వహించాలని మార్చి 28న జరిగిన భేటీలో నిర్ణయించారు. మహా సత్యాగ్రహలో భాగంగా దేశవ్యాప్తంగా మండల లేదా తాలూకా స్థాయిలో స్ట్రీట్ మీటింగ్స్ నిర్వహించి.. మోదీ ప్రభుత్వం ఆదానీని ఎలా రక్షించుకొస్తుంది.. ఈ అంశంపై నిలదీసినందుకే రాహుల్ గాంధీపై ఎలా అనర్హత వేటు వేసింది.. ప్రజలకు వివరించాలని తలపెట్టారు. ఈ కార్యాచరణ మార్చి 31వ తేదీన ప్రారంభం కాబోతోంది. మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో గ్రౌండ్ లెవెల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించి.. మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తేలా ప్లాన్ చేశారు. ఈ ప్రెస్ మీట్లలో ఏం మాట్లాడాలన్న అంశాన్ని పుస్తక రూపంలో చేరవేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దమైంది. ఏప్రిల్ 3న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగాల ఆధ్వర్యంలో అంబేద్కర్, గాంధీ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీకి లేఖాస్త్రాలను సంధించేలా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యుఐ వర్గాలను ఆదేశించారు. ఏప్రిల్ 15 తర్వాత దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలను నిర్వహించనున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఈ అన్ని కార్యక్రమాలకు స్థానికంగా కలిసి వచ్చే పార్టీలను ఆహ్వానించాలని పిలుపునివ్వడం ఓ వ్యూహంగానే భావించాలి. ఇలా స్థానికంగా పార్టీలను కలుపుకుని పోవడం ద్వారా ప్రజల్లోకి విపక్షాలు ఐక్యంగా వున్నాయన్న సందేశాన్ని పంపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అదేసమయంలో మిత్రపక్షాలు తమ కూటమిలోనే కొనసాగేలా వ్యూహ రచన కూడా చేస్తోంది. ఇందులో భాగంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్, మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ కలిసి ముందుకు వెళుతున్నాయి. మొత్తంగా చూస్తే ఎన్సీపీ, డిఎంకే, శివసేన (ఉద్ధవ్ వర్గం), టీఎంసీ, సమాజ్‌వాదీ, సీపీఐ సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ, ఎండిఎంకే, కేరళ కాంగ్రెస్, ఆర్ఎస్పీ, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, వీసీకే, జేఎంఎం పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము నెల రోజుల పాటు నిర్వహించనున్న సత్యాగ్రహ కార్యక్రమాలలో ఈ పార్టీలు కలిసి నడుస్తాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించడం చూస్తే కాంగ్రెస్ అధిష్టానంలో విశ్వాసం రెట్టింపయినట్లు కనిపిస్తోంది.

ప్రతివ్యూహంతో బీజేపీ సిద్ధం

మొత్తమ్మీద 2024 సార్వత్రిక ఎన్నికల దాకా ఇపుడు జత కలిసిన 19 పార్టీలను తమ కూటమిలో కాపాడుకునే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది. తమ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు ముందు లేవు కాబట్టి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ కూటమిలోనే 2024 ఎన్నికల దాకా వుండొచ్చు. కానీ, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2024 జనరల్ ఎలెక్షన్స్ కంటే ముందే జరుగుతాయి. దాంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళితే.. అది తెలంగాణలో బీజేపీకి లాభించే అవకాశం వుంది. ఈక్రమంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. నిజానికి 2023 చివరి అంకంలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జతకడతాయని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ రెండు పార్టీలు కలిసే అవకాశాలు తాజా కూటమి కూర్పు ద్వారా వెలుగు చూస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందైనా, తరువాతైనా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిస్తేనే కేంద్రంలోని మోదీ సర్కార్‌ను గద్దె దింపవచ్చని ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రంలో మూడోసారి కూడా మోదీ సర్కార్ ఏర్పాటైతే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడుతుందని కాంగ్రెస్ నేతల్లో చాలా మంది భావిస్తున్నారు. విపక్షాల కూర్పుపై క్రమంగా ఓ క్లారిటీ వస్తున్న నేపథ్యంలో మార్చి 28న న్యూఢిల్లీలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ వ్యూహాన్ని కూడా కొంత మేరకు బహిర్గత చేశాయి. బీజేపీ కేంద్ర కార్యాలయ విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. తమ ప్రభుత్వం అవినీతిని అరికట్టే చర్యలు తీసుకుంటుంటే.. అవినీతిపరులను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. కరప్షనిస్టులంతా ఏకమవుతున్నారని మోదీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటుంటే.. వాటిపై అవినీతి పరులైన రాజకీయ నేతలంతా దాడి చేస్తున్నారని మోదీ అన్నారు. 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనతో కేవలం 5 వేల కోట్ల రూపాయలను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద స్వాధీనం చేసుకుంటే తమ 9 ఏళ్ళ ప్రభుత్వంలో ఇప్పటి దాకా 10 లక్షల కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అవినీతి నిరోధానికి తాము కఠిన చర్యలు తీసుకుంటుంటే అవినీతిపరులైన విపక్ష నేతలంతా ఒక్కటవుతున్నారని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిని బట్టి బీజేపీ విపక్ష కూటమిపై ఎదురు దాడికి తగిన వ్యూహంతో రెడీగా వున్నట్లు బోధపడుతోంది.