పండుగల సీజన్ సమీపిస్తోంది. వచ్చే రెండు నెలల్లో వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఉన్నాయి. ఈ సమయంలో పట్టణాల్లో ఉద్యోగాల నిమిత్తం ఉండే వారు స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తుంటారు. దీంతో ముందస్తుగా ట్రైన్ లేదా బస్ టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో కొంత మంది అక్రమంగా ముందే టికెట్లు బుక్ చేసేసుకొని బయట అధిక ధరలకు విక్రయిస్తూ ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మనకు తప్పదు కాబట్టి లాస్ట్ మినిట్లో వారి వద్ద కొనుగోలు చేస్తుంటాం. అయితే ఇలా చేయడం వల్ల మీరు నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఒక టికెట్ లనే ఇద్దరు, ముగ్గురు అమ్మేసే వారు ఉంటారు. ఇలాంటి వారు తరచూ రైల్వే స్టేషన్‌ల వెలుపల లేదా బస్ స్టాప్‌ల వద్ద ఉంటారు. వీరిని టౌట్ లని పిలుస్తారు. అందుకే మీరు టికెట్ బుక్ చేసుకొనే ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా రైలు టికెట్ బుకింగ్ విషయంలో ఐఆర్సీటీసీ కొన్ని సూచనలు చేస్తోంది. అవేంటో చూద్దాం రండి..
ఆపరేషన్ ఉపలబ్ద్: ఇ-టికెటింగ్ టౌట్‌లను అరికట్టడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జూలై 2022లో ప్రారంభించిన మిషన్-మోడ్ ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్ కింద, ఆర్పీఎఫ్ 1,000 మంది టౌట్‌లను అరెస్టు చేసింది. రూ. కోటి నగదును స్వాధీనం చేసుకుంది.
ప్రయాణికులు ఐడీ కార్డులు చూపించడం తప్పనిసరి చేయడం: టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు తమ ఐడీ కార్డులను చూపించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇతర వ్యక్తుల పేర్లతో టిక్కెట్లు బుక్ చేసుకోవడాన్ని నియంత్రించడానికి దీనిని తీసుకొచ్చారు.
ఐఆర్సీటీసీ వెబ్‌సైట్, యాప్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అనేది రైల్వే టిక్కెట్‌ల బుకింగ్‌ను నిర్వహించే ప్రభుత్వ సంస్థ. ప్రయాణీకులు నేరుగా టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్, యాప్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.
ఈ చర్యలు రైల్వే టికెట్ల టౌట్‌ల కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. అరెస్టయిన టౌట్‌ల సంఖ్య పెరిగింది. టౌటింగ్‌ను అరికట్టడానికి, ప్రయాణీకులు సులభంగా, సరసమైన ధరలో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చని నిర్ధారించడానికి తదుపరి చర్య తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే మీ వంతుగా, అప్రమత్తంగా ఉండండి. ఈ టౌట్‌ల గురించి తెలుసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..