Spy Movie
మూవీ రివ్యూ: స్పై
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, సాన్య ఠాకూర్, తనికెళ్ల భరణి, ఆర్యన్ రాజేష్, మరకంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా నితిన్ మెహతా, రానా దగ్గుబాటి (గెస్ట్ రోల్) తదితరులు..
సినిమాటోగ్రఫీ: మార్క్ డేవిడ్, వంశీ పచ్చిపులుసు
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
నిర్మాత : కే.రాజశేఖర్ రెడ్డి (ED ఎంటర్టైన్మెంట్స్)
ఎడిటర్, దర్శకత్వం: గ్యారీ బిహెచ్
కార్తికేయ 2 తర్వాత హీరో
నిఖిల్ సిద్ధార్ధ్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈయన కోసం పాన్ ఇండియన్ సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇలాంటి సమయంలో స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు నిఖిల్. మరి ఈ సినిమాతో ఆయన ఆకట్టుకున్నారా లేదా..? నేతాజి ఫార్ములా వర్కవుట్ అయిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఖాదిర్ (నితిన్ మెహతా)ను పట్టుకోడానికి రా చీఫ్ ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ ఎప్పుడూ మిస్ అవుతూ ఉంటాడు. పక్కా స్కెచ్ వేసి ఇండియన్ ఏజెంట్ సుభాష్ (ఆర్యన్ రాజేష్) ను పంపిస్తారు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో సుభాష్ చనిపోతాడు. అతడి మరణానికి కారణం తెలుసుకోడానికి అతడి తమ్ముడు జై (నిఖిల్) వస్తాడు. రా ఛీఫ్ శాస్త్రీ (మకరంద్ దేశ్‌పాండే) ఆర్డర్స్‌పై మిషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే మన దేశానికి అత్యంత కీలకమైన ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫైల్ మిస్ అవుతుంది. అది టెర్రరిస్ట్ చేతుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? దాన్ని మళ్లీ మన దేశానికి ఎలా తీసుకొచ్చారు అనేది మిగిలిన కథ..
కథనం:
స్పై సినిమా అంటే ఓ మొబైల్.. నాలుగు గన్స్.. ఓ టెర్రరిస్ట్ అటాక్ కాదు. దానికి చాలా పకడ్బందీ కథ, కథనాలు ఉండాలి. కథ బాగుంటే సరిపోదు.. కథనం కూడా ఆసక్తికరంగా ఉంటేనే స్పై కథలు ఆకట్టుకుంటాయి. అది నిఖిల్ స్పై సినిమాలో మిస్ అయింది. రా ఏజెంట్ అంటే ఎక్కడికైనా వెళ్లిపోతాడు.. ఏదైనా చేస్తాడంటూ లాజిక్ లేని సీన్స్ చూపించారు. రొటీన్ టెంప్లేట్ కథకు నేతాజీ టచ్ ఇచ్చినట్లు అనిపించిందే కానీ.. ఆయన గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలైతే ఏం చెప్పలేదు. పైగా కొన్ని నిజాలు తెలుసుకోకుండా ఉంటేనే మంచిదని హీరోనే చెప్పాక.. కొత్తగా ఏం చూపించారనేది మాత్రం అర్థం కాలేదు. యూ ట్యూబ్‌లో సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలిసే ఇన్ఫో కంటే కాస్త ఎక్కువిచ్చారంతే. క్లైమాక్స్‌లో కోహిమాలో నేతాజీ గురించి ఓ సీక్రేట్ మాత్రమే చూపించారు. అది మినహాయిస్తే సినిమాలో చెప్పుకోడానికి పెద్దగా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే కనిపించలేదు. ఫస్టాఫ్ అంతా యాక్షన్ సీన్స్‌తో నిండిపోయింది.. అక్కడక్కడా కొన్ని బాగున్నాయి కూడా.. కాకపోతే కీలకమైన సెకండాఫ్ పూర్తిగా గాడి తప్పింది. రానా ఉన్న ఒక్క సీన్.. నేతాజి గురించి చెప్పే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కార్తికేయ 2లో కృష్ణుడి గురించి చూపిస్తే వర్కవుట్ అయిందని.. ఇక్కడ నేతాజీని కమర్షియల్ కోసం వాడుకున్నట్లు అనిపించింది. ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రేట్ అంటూ ప్రమోషన్‌లో వాడింది.. సినిమాలో అయితే కనిపించలేదు. చాలా లాజిక్ లేని సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి.
నటీనటులు:
నిఖిల్ ఎందుకో చాలా లావుగా ఉన్నాడు స్క్రీన్ మీద. నటుడిగా తన పాత్రకు న్యాయం చేసాడు. హీరోయిన్స్‌ను గ్లామర్ కోసం కాకుండా కథలో కలిపేసాడు దర్శకుడు గ్యారీ. ఇటు ఐశ్వర్య మీనన్.. అటు సాన్య ఠాకూర్ ఇద్దరూ బాగానే నటించారు. మకరంద్ దేశ్ పాండే రా ఛీఫ్‌గా పర్లేదు. ఆర్యన్ రాజేష్, రవి వర్మ, సచిన్ ఖేడ్ కర్ అంతా ఓకే. రానా దగ్గుబాటి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.
టెక్నికల్ టీం:
స్పై సినిమాకు పాటలు పెద్ద మైనస్. ఉన్న రెండు పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కాకపోతే శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ అంతంతమాత్రంగానే ఉంది. ఎడిటింగ్ కూడా చాలా క్లంబ్జీగా ఉంది. ఏదో హడావిడిగా పూర్తి చేసినట్లే అనిపించింది. దర్శకుడిగా గ్యారీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఎంత స్పై అయినా.. కొన్ని లాజిక్స్ అయితే ఉండాలి కథలో.. అవేం ఇందులో కనిపించలేదు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా స్పై.. మిషన్ ఫెయిల్.. మిస్ ఫైర్..