Digestive System problems – Natural remedies: ఆధునిక ప్రపంచంలో ప్రతిఒక్కరూ రుచికరమైన ఆహారానికి అలావాటుపడ్డారు. ముందువెనుక ఆలోచించకుండా.. రుచికరమైన ఆహారం తింటూ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇది అక్షరాల నిజం.. ఎందుకంటే.. నేటిసమాజంలో ఉదర సమస్యలు ముఖ్యంగా మనం తినే ఆహారం నుంచే ఉద్భవిస్తున్నాయి. జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోతే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏదైనా కొంచెం ఆహారం తిన్నా.. గ్యాస్ట్రిక్, అజీర్తి, కడుపునొప్పి, కడుపులో మంట లాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే అలాంటి వారు చిన్న చిన్న చిట్కాలను.. ఇంటినుంచే పాటించి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుచుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తెలుసుకుందాం..
గోరువెచ్చని నీరు..
కడుపులో సమస్యలను ఉత్పన్నంకాకుండా చేయడంలో గోరువెచ్చని నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే జీర్ణవ్యస్థ మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఆహారం తిన్న అరగంట తరువాత గోరువెచ్చని నీరు తాగాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమై.. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
ఫైబర్ పదార్థాలు..
ఫైబర్ ఎక్కువ పదార్థాలున్న ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరును పెంచుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే పళ్లు, తృణధాన్యాలు, కూరగాయలను తినాలని సూచిస్తున్నారు. వాటివల్ల సులభంగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది.
ఉపవాసం..
తరచుగా.. మీ జీర్ణవ్యవస్థ ప్రక్రియలో సమస్యలు ఉత్పన్నమవుతుంటే.. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ఉపవాసం మంచిగా ఉపయోగపడుతుందని పెద్దలు పేర్కొంటారు. కడుపులో ఇబ్బందులను అధిగమించడానికి వారానికి ఒకరోజు ఉపవాసం చాలా మంచిదని నిపుణులు కూడా పేర్కొంటున్నారు.
వ్యాయామం.. వాకింగ్..
ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఒక గంట లేదా అరగంటపాటు వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నడక వల్ల ఆరోగ్యంతోపాటు.. జీర్ణవ్యవస్థ ప్రక్రియ కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు యోగా ఆసనాలు కూడా మేలు చేస్తాయని సూచిస్తున్నారు. ప్రతిరోజూ వజ్రాసనం వేయాలని, శ్వాస తీసుకోవడం వదిలేయడం ద్వాకా జీర్ణప్రక్రియ వేగవంతమవుతుందని పేర్కొంటున్నారు.
రాగి పాత్ర..
రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కడుపులో సమస్యలన్నీ తొలగిపోతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. ఆ రాగి పాత్రలను నేలపై ఉంచవద్దని సూచిస్తున్నారు.
చల్లని పదార్థాలు..
జీర్ణవ్యవస్థ పనితీరు సక్రమంగా లేనప్పుడు.. చల్లని పానీయాలు తీసుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటప్పుడు కుండలో నీటిని తాగాలి. ముఖ్యంగా ఫ్రిజ్‌లోని పదార్థాలను తినడం మానుకోవాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీ, కాఫీ..
ముఖ్యంగా టీ, కాఫీ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. అంతకూ మీరు టీ తాగాలనుకుంటే.. గ్రీన్ టీ లేదా అల్లం, నిమ్మ టీ తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆ టైంలో అస్సలు తినవద్దు..
చాలా మంది నిద్రపోయే ముందు అన్నం తింటుంటారు. ఆ వెంటనే నిద్రపోతారు. అలాంటి వారికి త్వరగా ఆహారం జీర్ణం కాదని వైద్యులు పేర్కొంటున్నారు. దీనివల్ల గ్యాస్, వాంతులు, విరేచనాలు, అజీర్తి, తదితర సమస్యలు వస్తాయని.. కావున నిద్రపోయే రెండు గంటల ముందు రాత్రి భోజనం చేయాలని సూచిస్తున్నారు.
Also Read: