డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ చిత్రం శాకుంతలం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. మలయాళీ నటుడు దేవ్ మోహన్ కలిసి నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుతంతలాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు డైరెక్టర్ గుణశేఖర్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకోగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటిని పెంచింది. దీంతో శాకుంతలం సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేశారు చిత్రయూనిట్. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సామ్.. శాకుంతలం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
శాకుంతలం సినిమాలో.. హీరోయిన్ సమంత శకుంతల పాత్రలో.. దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇందులో దుష్యంతుడి పాత్రకు ఫస్ట్ ఛాయిస్ దేవ్ మోహన్ కాదని తెలిపారు. ఈ పాత్ర కోసం ముందుగా దుల్కర్ సల్మాన్ ను తీసుకోవాలనుకున్నారట. కానీ దుల్కర్ సల్మాన్ అప్పటికే సీతారామం సినిమా కోసం సంతకం చేయడంతో డేట్స్ క్లాష్ అవుతాయని భావించి సినిమాకు నో చెప్పారట. ఇక తెలుగు హీరోలను ఎంపికచేయకపోవడానికి కూడా ఓ కారణం ఉందట. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు రాలేదట. దీంతో మలయాళీ హీరో దేవ్ మోహన్ ను తీసుకున్నట్లు తెలిపారు.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, అనన్య నాగళ్ల కీలకపాత్రలలో నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ బాలనటిగా వెండితెరకు పరిచయం కాబోతుంది.