హైదరాబాద్, ఆగస్టు 24: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగస్టు 22వ తేదీతో ముగిసింది. దాదాపు19 వేల మందికిపైగా విద్యార్థులు వెబ్‌ఆప్షన్ల నమోదులో ఐచ్ఛికాలు ఇచ్చుకున్నారు. ఐచ్చికాలు నమోదు చేసుకున్నవారిలో అధిక శాతం మంది చివరి విడత కౌన్సెలింగ్‌లోనే సీటు పొందిన వారే. అంతేకాకుండా వారంతా సీటు పొందిన కాలేజీల్లో రిపోర్ట్ చేశారు కూడా. ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో దాదాపు 64 వేల మందికిపైగా విద్యార్ధులు సీట్లు పొందిన సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేశారు. ఇక ఎంసెట్ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ఆగస్టు 26వ తేదీన ఉంటుందని సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు.
తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు నియామక రాత పరీక్షలు బుధవారం (ఆగస్టు 23)తో ముగిశాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ కూడా బోర్డు విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ ‘కీ’పై అభ్యంతరాలు స్వీకరించిన రెండు రోజుల్లోగా తుది కీలను కూడా బోర్డు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్ధులకు సంబంధించిన జవాబు పత్రాలు బోర్డు అందుబాటులో ఉంచింది. గడువులోగా అభ్యంతరాలు తెలపాలని సూచించింది. ఇక ఫలితాలు ఆగస్టు నెలాఖరులోగా వెల్లడించనుంది. అంతా సవ్వంగా జరిగితే అక్టోబరుకల్లా నియామకాలు పూర్తి చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తొలత ఉన్నతస్థాయి పోస్టులు ఆ తర్వాత స్థాయిన బట్టి కిందికి అవరోహణ క్రమంలో నియామక ప్రక్రియ పూర్తిచేయనుంది. అంటే తొలుత డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ఆ తరువాత పీజీటీ, టీజీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన చేసే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాకు సంబంధించి మొదటి విడతలో సీట్ల కేటాయింపు మెరిట్ జాబితా ఆగస్టు 24న విడుదలవుతుంది. మొదటి రౌండ్ కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు ఎంపికైన విద్యార్థుల మెరిట్ జాబితాను కాలేజీల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆగస్టు 26వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలని కాళోజీ హెల్త్ వర్సిటీ ప్రకటన వెలువరించింది.
అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు తమ వివరాలను చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.