విజయనగరం, ఆగస్టు 23: అతను రైతు కుటుంబం నుంచి వచ్చాడు. కష్టపడి చదువుకున్నాడు. శారీరక దారుఢ్య పరీక్షలతో పాటు రాత పరీక్షల్లో కూడా క్వాలిఫై అయ్యి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో పోలీస్ కానిస్టేబుల్ అయ్యాడు. ఎంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాడో అంతే కష్టపడి సిన్సియర్ గా పనిచేసి ఉన్నతాధికారుల వద్ద కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు. అలా చండీగఢ్ లో సుమారు పదేళ్ల పాటు కానిస్టేబుల్ గా మచ్చ లేకుండా పనిచేశాడు. అంత వరకు బాగానే తర్వాత స్నేహితుల కారణంగా చెడు వ్యసనాలకు అలవాటయ్యాడు. మద్యం, బెట్టింగ్ వంటి జూదాలకు బానిసై అప్పుల పాలయ్యడు. తరువాత ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని విజయనగరం జిల్లాలోని తన స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు.
అలా తిరిగి ఇంటికి వచ్చిన ఈ మాజీ కానిస్టేబుల్ చేసిన పనులకు పోలీసులే షాక్ అయ్యారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొప్పంగి గ్రామానికి చెందిన శ్రీనువాసరావు ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చిన తరువాత కొన్నాళ్లు కుటుంబాన్ని నడపటానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఏదో ఒక పని చేసుకుందాం అనుకుంటే అవకాశాలు దొరకలేదు. ఓ వైపు కుటుంబ పోషణ, మరోవైపు కొనసాగుతున్న చెడు వ్యసనాలు ఇతనిని నేర ప్రవృత్తి వైపు మరల్చాయి. అందుకు దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. అందుకోసం సొంత ఊరు కొప్పంగి నుండి మకాం మార్చి విజయనగరం జిల్లా కేంద్రంలోని ఉడా కాలనీకి వచ్చి స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నాడు. అక్కడ పగలు కానిస్టేబుల్ గా బయట ప్రపంచానికి కలరింగ్ ఇచ్చి రాత్రులు తనలో ఉన్న రెండో కోణాన్ని బయటకు తీసేవాడు. పగలంతా రెక్కీ చేసి రాత్రి దొంగతనాలకు పాల్పడేవాడు.
ఎప్పుడు దొంగతనానికి వెళ్లిన తనకున్న శారీరక దారుఢ్యంతో ఒంటరిగా ఒక్కడే సీన్ లోకి వెళ్లి దొంగతనాలు చేసేవాడు. అలా జిల్లా కేంద్రంలో సుమారు పన్నెండు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు.. భారీగా డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు కాజేశాడు. అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. కానీ కానిస్టేబుల్ గా పనిచేసిన పరిజ్ఞానం ఉన్న శ్రీనువాసరావు ఎక్కడా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. అయితే పట్టణంలో వరుస దొంగతనాలు, అందులో ఒకే రకంగా కొనసాగుతున్న చోరీలు పోలీసులకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఇదే క్రమంలో పట్టణంలో జరిగిన ఈ మాజీ కానిస్టేబుల్ చేసిన మరో చోరీ లో తీవ్రంగా శ్రమించారు పోలీసులు. అదే సమయంలో ఓ ప్రాంతంలో కనపడీ కనపడని రీతిలో సిసి కెమెరాలో శ్రీనువాసరావు కనిపించాడు. దీంతో అనేక రకాల దర్యాప్తు చేపట్టిన తరువాత ఎట్టకేలకు మాజీ కానిస్టేబుల్ శ్రీనువాసరావు ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తరువాత పోలీసులు తమదైన విచారణ జరపగా తాను చేసిన అన్ని నేరాలు స్వయంగా ఒప్పుకున్నాడు. అలా అతని వద్ద నుండి సుమారు ఇరవై ఐదు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఆరు కిలోల వెండి వస్తువులు, దొంగతనం చేసేందుకు వినియోగించే పనిముట్లును రికవరీ చేసి రిమాండ్ కు పంపారు. పోలీసులకు సవాలుగా మారిన వరుస చోరీల్లో నిందితుడు శ్రీనువాసరావు దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.