ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. దాదాపు 154 పరీక్ష కేంద్రాల్లో 30,134 మంది విద్యార్ధులు పరీక్షలు రాయబోతున్నారు. గతేడాది పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లు నిర్వహించారు. ఐతే ఈ ఏడాది వాటిని ఆరు పేపర్లకే కుదించి పరీక్షలు నిర్వహించేలా పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు. సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్, నేచురల్ సైన్స్‌కు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు, వేర్వేరుగా ఆన్సర్ బుక్‌లెట్లు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన ప్రీ పబ్లిక్ పరీక్షలో ప్రాక్టీస్ చేయించినా విద్యార్ధుల్లో అయోమయం తొలగిపోలేదు. చాలా స్కూళ్లల్లో విద్యార్థులు ఫిజిక్స్ ఆన్సర్ బుక్‌లెట్‌లో నేచురల్ సైన్స్ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు రాశారు. ఇదే పొరపాటు పబ్లిక్ పరీక్షలో కూడా పునరావృతమైతే ఎలా.. అని ఆందోళన చెందుతున్నారు.
సైన్స్ సబ్జెక్ట్ పరీక్ష సమయంలో రెండు ప్రశ్నపత్రాలు, రెండు ఆన్సర్ బుక్‌లెట్లు ఒకేసారి ఇస్తారు. పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. విద్యార్థులకు సులువుగా ఉన్న ప్రశ్నలకు తొలుత ఆన్సర్‌లు రాస్తారు. సమాధానాలు మాత్రం వేర్వేరు ఆన్సర్ షీట్లపై రాయాల్సి ఉండటంతో వాటిని రాసే క్రమంలో ఏదైనా పొరపాటున ఒక దానిపై రాయాల్సింది మరోదానిపై రాస్తే విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతుందని, ఒకే ఆన్సర్‌బుక్‌లెట్‌లో సమాధానాలు రాసేలా వెసులుబాటు కల్పించాలని ఇప్పటికే ఉపాధ్యాయులు పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. తాము ఎంత ప్రాక్టీస్ చేయించినా ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు పాఠశాల స్థాయిలో నిర్వహించిన పరీక్షలోనే అయోమయం చెంది ఒకటే బుక్‌లెట్‌పై ఫిజిక్స్, ఎన్‌ఎస్‌కు సమాధానాలు రాశారని పలువురు హెచ్‌ఎంలు తెలిపారు. పరీక్ష ఒకే రోజు పెడుతున్నప్పుడు ఆన్సర్‌షీట్ సైతం రెండింటికి కలిపి ఒకటే ఇచ్చి రాయమంటే బాగుండేదని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.