ఏలూరు, ఆగస్టు 24: ఊరన్నాకా ఇళ్లు-వాకిళ్లు ప్రజలు తాగేందుకు మంచినీటి బావులు, లేదంటే చెరువులు ఉంటాయి. కాని ఆ ఊరిలో అలాంటివి ఏవీ కనిపించవు. ఊరంతా కొండలు నుంచి వచ్చే నీటిని తాగుతారు. ఎత్తయిన కొండలు నుంచి జాలువారే నీటిని పట్టుకునేందుకు ఒక గొట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు స్ధానికులు…దీంతో ఆ ఊరి పేరే గొట్టపుతోగుగా మారిపోయింది.
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో గొట్టపు తోగు గ్రామం ఉంది. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో 20 ఇళ్ళు మాత్రమే ఉండే ఒక పల్లె అది. దారి, తెన్ను ఉండదు. ప్రధాన రహదారికి 15 కిలో మీటర్లు దూరంలో అటవీ ప్రాంతంలో ఉండే ఆ పల్లెకు అతి కష్టం మీద ద్విచక్ర వాహనం మాత్రమే నడవ గలదు. అటువంటి పల్లెల్లో తాగునీటికి ప్రకృతే ఆధారం.
ఆ గ్రామానికి ఆనుకొని ఎత్తైన కొండ ఉంది. ఆ కొండ రాళ్లు లోపలి పొరల నుంచి జలదధార ఒకటి బయటకు వస్తుంది. గ్రామస్తులు ఆ ధారకు ఒక గొట్టాన్ని అమర్చి ఆ నీటిని పట్టుకొని తమ తాగునీరు, ఇతర అవసరాలకు తీర్చుకుంటున్నారు. ఆ గొట్టం ద్వారా వచ్చే జల ధారతోనే ఆ గ్రామం బతుకుతుంది. అందుకే, ఆ గ్రామానికి ‘గొట్టపు తోగు ‘ అన్న పేరును పెట్టుకున్నారు అక్కడి ఆదివాసులు.
ఆ గ్రామంలో అంతకుమించి తాగునీటి వసతి లేదు. బోరు వేసేందుకు రిగ్గు లారీ ఆ గ్రామానికి వెళ్ళలేదు. దీంతో అక్కడి ఆదివాసులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అధికారులకు గగనమైంది. అయితే ప్రక్రృతి వారిని కరుణించింది. నిత్యం ఓ నీటి పాయ కొండరాతి పొరల నుంచి జాలువారుతుంటుంది. మండే వేసవిలో కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆ నీరు 24 గంటలు ఒకే విధంగా క్రిందికి వస్తుంటుంది. చత్తీస్ ఘడ్ నుండి వలస వచ్చిన ఆదివాసులు అక్కడ నివసిస్తున్నారు. కుక్కునూరు మండలం బంజరగూడెం నుంచి అటవీ మార్గంలో వెళ్తే ఆ గ్రామ దర్శనమిస్తుంది. అమ్మలా అడవి అక్కడ ప్రజలు దాహం తీరుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.