Big News Big Debate: ఏపీలో విశాఖ యుద్ధం.. రాజకీయ సాగర మథనం
ఏపీలో విశాఖ యుద్ధం కొనసాగుతోంది.. అధికారపార్టీపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శల దాడి పెంచారు. వైసీపీ నుంచి అంతే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. రిషికొండ, ఎర్రబట్టిదిబ్బలు, కబ్జాలపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. జనసేన చేసిన ఆరోపణలపై చిత్తశుద్ది ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏపీ బీహార్ కంటే దారుణంగా తయారైందని పవన్ అంటే... సీఎంపై విద్వేషంతో చేస్తున్న వ్యాఖ్యలు అంటున్నారు వైవీ సుబ్బారెడ్డి. రిషికొండలో అక్రమాలు ఉన్నాయంటున్న పవన్ కల్యాణ్‌కు గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూమి అక్రమణలు కనిపించడం లేదా అంటున్నారు.
ఆంధ్రా వాళ్ళను తెలంగాణా నుంచి తరిమేయడానికి జగన్ ఒక కారణమన్నారు పవన్ కళ్యాణ్. జనవాణిలో సగం ఫిర్యాదులు భూ కబ్జాలు, దొమ్మీలు, హత్యలే అని పేర్కొన్నారు. తాడేపల్లిలో నేరాల సంఖ్య అత్యధికంగా ఉంటుందని.. రేప్ జరిగితే మహిళా హోమ్ మంత్రి తల్లిదండ్రుల పెంపకలోపం అనడం దారుణమన్నారు పవన్. బీహార్ కంటే ఆంధ్ర ప్రదేశ్ నేరాల కేంద్రంగా మారిందని అన్నారు. రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల విషయంలో పవన్ చర్చ కు రావాలన్నారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. ఎర్రమట్టి దిబ్బల పరిసర ప్రాంతాల్లో లాండ్ పూలింగ్ చేసింది టీడీపీనే అన్నారు. రుషికొండ పై అక్రమ నిర్మాణాలు ఉంటే సుప్రీం కోర్టు వదిలేస్తుందా? అని ప్రశ్నించారు. రుషికొండకు లెఫ్ట్ టర్న్ ఇచ్చుకుంటే చంద్రబాబు బంధువులకు చెందిన గీతం ఉందన్నారు వైవీ. ముఖ్యమంత్రిపై పవన్ నిలువెల్లా ద్వేషం నింపుకుని ప్రజలను మభ్య పెట్టే మాటలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.