రాజ్యాలు పోయాయి.. రాజులు అంతరించారు.. అయినా వారి ఆనవాళ్ళు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. ఆలాంటి ఆనవాళ్లలో శిధిలమైన రాజుల కోటలు, జీర్ణావస్థలో ఉన్న పురాతన దేవాలయాలు ఉన్నాయి. అయితే అవి ఇప్పుడు గుప్త నిధుల వేటగాళ్ళకు ప్రధాన టార్గెట్‌గా మారాయి. రాజులు పాలించిన కోటల్లో గుప్తనిధులు ఉన్నాయంటూ నమ్ముతున్న వేటగాళ్ళు వాటిని కొల్లగొట్టేందుకు పెద్ద ఎత్తున పధకం ప్రకారం తవ్వకాలు చేస్తున్నారు. ఈ తవ్వకాల్లో నిధులు దొరికన సందర్భాలు లేకపోయినా, ఇప్పుడు ఈ వ్యవహారం ప్రకాశం జిల్లాలో ఓ పెద్ద వ్యాపకంగా మారిపోయింది. గుప్త నిధుల వేటగాళ్ల ఆశలను అవకాశంగా తీసుకున్న కొంతమంది మోసగాళ్లు.. మంత్రగాళ్ల అవతారం ఎత్తి క్షుద్ర పూజలు చేస్తామంటూ ముందుకు వస్తున్నారు.
కాకతీయుల హయాంలో ప్రకాశం జిల్లాలోని కొచ్చెర్లకోట గ్రామం ప్రముఖ పట్టణంగా ఉండేడి. రెడ్డిరాజులు, వెంకటగిరి రాజాల హాయంలో కూడా ఈ ప్రాంతం అన్ని హంగులతో విలసిల్లింది. ఆ సమయంలో కొచ్చెర్లకోటలో కాయతీయుల వంశానికి చెందిన రుద్రమదేవి తండ్రి గణపతిదేవుడు కొచ్చెర్లకోటలో కొంతకాలం నివాసం ఏర్పాటు చేసుకుని గ్రామంలో శివాలయాన్ని నిర్మించాడు. అంతేకాకుండా గ్రామ సమీపంలోని కొండగుహలో ఏడు గదులు నిర్మించి అందులో అంతులేని బంగారం, వజ్ర, వైఢూర్యాలు దాచి ఉంచాడని ప్రచారం ఈ ప్రాంతాల్లో ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని.. నమ్మకాన్ని.. ఆధారం చేసుకున్న కొంతమంది ఒకేసారి కోట్లకు పడగెత్తాలని ఆశించే వాళ్లు కొంతమంది గుప్త నిధుల బాట పట్టారు. నాలుగేళ్ళ క్రితం గుప్తనిధుల కోసం ఏకంగా కొచ్చెర్ల కోట కొండనే తొలిచేశారు. కొండలో ఓ చోట ఉన్న గుహలో నుంచి సొరంగ మార్గం తవ్వేశారు.
ఈ సొరంగం ద్వారా రాజు నిర్మించిన ఏడు గదుల్లో ఉన్నాయని భావిస్తున్న నిధి, నిక్షేపాల కోసం 300 మీటర్లు తవ్వేశారు. ఇలా తవ్వడానికి వీరికి ఏడాది పట్టింది. ఇంకా లోపలివరకు తవ్వేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఆనోటా, ఈ నోట పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు దాడి చేసి గుప్త నిధులకోసం తవ్వకాలు చేస్తున్న 50 మంది కూలీలను అరెస్టు చేశారు. ఈ సంఘటన ప్రకాశంజిల్లా దినకొండ మండలం కొచ్చెర్లకోట సమీపంలోని కొండల్లో అప్పట్లో కలకలం సృష్టించింది. తిరిగి ఇటీవల కాలంలో కొంతమంది ఈ పులిగుహలో గుప్తనిధులు ఉన్నాయన్న ప్రచారాన్ని ఇప్పటికీ నమ్ముతూ కార్లు వేసుకుని వస్తున్నారు. దీంతో తిరిగి గ్రామంలో అలజడి రేగింది. ఈ ప్రాంతం వైపు కొత్తవారు ఎవరు వచ్చినా గ్రామస్థులు ఆరా తీస్తున్నారు. పులిగుహ ఉన్న కొండవైపు ఎవరూ వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే రాజుల కోటల్లో, దేవాలయాల్లో గుప్తనిదులు ఉన్నాయన్న మాట వాస్తవం కాదని, ఇది కేవలం కొంతమంది స్వార్ధపరులు చేస్తున్న ప్రచారం మాత్రమేనని జనవిజ్ఙాన వేదిక నేతలు కొట్టి పారేస్తున్నారు. గుప్త నిధుల కోసం నరబలులు, తాంత్రిక పూజలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి పనుల్లో చదువుకున్న వారు సైతం ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ది చెందినా పల్లెల్లో మూఢ నమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయనడానికి ఇలాంటి ఉదహారణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజలు గుప్త నిధుల మాయలో పడి ప్రాణాలు, ఆస్థులు పోగొట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లి్క్ చేయండి..