Sri Ramanavami: అక్కడ రామయ్యకు రెండు సార్లు కళ్యాణం.. పగలు ఒకసారి రాత్రి మరోసారి.. ఐదు రోజుల పెళ్లి అరుదైన ఘట్టం..ఈ క్షేత్రం విశేషమేమిటో తెలుసా..!

ఈ క్షేత్రంలోని సీతారాములకు శ్రీ రామ నవమి రోజున మాత్రమే కాదు.. మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) రోజున కూడా సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి రోజున జరిపే వివాహవేడుకను తిరుకల్యాణ మహోత్సవమనీ, ‘దేవుని పెళ్లి’ అని పిలుస్తారు.

Sri Ramanavami: అక్కడ రామయ్యకు రెండు సార్లు కళ్యాణం.. పగలు ఒకసారి రాత్రి మరోసారి.. ఐదు రోజుల పెళ్లి అరుదైన ఘట్టం..ఈ క్షేత్రం విశేషమేమిటో తెలుసా..!
Ramatheertham Sri Rama Nava
Follow us
Surya Kala

|

Updated on: Mar 30, 2023 | 1:10 PM

దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారు. అయితే హిందూ సనాతన సంప్రదాయం ప్రకారం భారతదేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా సీతారాముల కళ్యాణం ఏడాదిలో ఒక్కసారి సారి అదీ చైత్ర శుద్ధ నవమి రోజున మాత్రమే నిర్వహిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక దేవాలయంలో మాత్రం రామయ్య సీతమ్మనిని రెండు సార్లు పరిణయమాడతాడు. అతిపురాతరణ ఆ దేవస్థానం ఎక్కడ ఉంది.. రెండు సార్లు శ్రీరాముడికి కళ్యాణం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం..

హిందూ ధర్మం ప్రకారం మనదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎక్కడైనా శ్రీరామ కల్యాణాన్ని ఏడాదిలో ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. శ్రీరాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి (శ్రీరామ నవమి) నాడే చేయడం ఆనవాయితీ. అయితే ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థం రామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరాముడికి ఏడాదికి రెండుసార్లు కల్యాణం జరుపుతారు. గత కొన్ని వందల ఏళ్లుగా ఇదే సంప్రదాయాన్ని ఇక్కడ కొనగిస్తున్నారు. రామతీర్ధం ఆలయ నిర్మాణం 16వ శతాబ్దంలో జరిగింది. అప్పటి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.

అక్కడ రామయ్యకు రెండుసార్లు పెళ్ళి!

ఈ క్షేత్రంలోని సీతారాములకు శ్రీ రామ నవమి రోజున మాత్రమే కాదు.. మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) రోజున కూడా సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి రోజున జరిపే వివాహవేడుకను తిరుకల్యాణ మహోత్సవమనీ, ‘దేవుని పెళ్లి’ అని పిలుస్తారు.

పగలు ఒకసారి, రాత్రి ఒకసారి రాములోరి పెళ్లి: 

చైత్ర శుద్ధ నవమి రోజున  సీతారాముల కళ్యాణ ఉత్సవాలను పగలు జరిపిస్తారు. తిరుకల్యాణ మహోత్సవం రాత్రి నిర్వహించడం విశేషం.

ఈ ప్రాంతంలో దేవుడి పెళ్లి జరిగిన తర్వాత మాత్రమే తమ ఇంటి లో జరిగే వివాహ వేడుకలకు ముహర్తం పెట్టుకుంటారు. ఈ ఆచారం కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ పాటిస్తున్నారు. రామతీర్థం సీతారాముల తిరుకల్యాణ మహోత్సవం జరిగిన అనంతరం ముహుర్తాలు పెట్టుకోవడం ఆచారం.

తిరుకల్యాణం కథ  ఏమిటంటే? 

16వ శతాబ్ద కాలంలో రామతీర్ధం ప్రాంతం అంతా అటవీ ప్రాంతం. సమీపంలోని కుంబిళాపురం (ప్రస్తుతం కుమిలి) గ్రామానికి చెందిన ఓ పుట్టు మూగ అయిన వృద్ధురాలు కట్టెల కోసం వచ్చేదట. ఓ సారి శ్రీరాముడు వృద్ధురాలికి ప్రత్యక్షమై.. ఆమె నాలుకపై ‘శ్రీరామ’ అనే బీజాక్షరాలు రాశాడట! ఈ విషయాన్ని వెంటనే ఆమె కుంబిళాపురాన్ని పరిపాలిస్తున్న పూసపాటి వంశీయులకు తెలిపింది.

అదే సమయంలో శ్రీరాముడు కుంబిళాపురం రాజు కలలో కనిపించి ఈ ప్రాంతంలో సీతా, రామలక్ష్మణ రాతి విగ్రహాలు ఉన్నాయని, వాటిని సేకరించి వెంటనే ప్రతిష్ఠించాలని కోరాడట. ఆ చక్రవర్తి, వృద్ధురాలు కలిసి వెతకగా నీటి మడుగులో ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహాలు లభించాయాట. తీర్థంలో రాముడి విగ్రహం లభించినందున ‘రామతీర్థం’ అని ఈ ప్రాంతానికి నామకరణం చేశారట.

రామతీర్థంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలను మాఘ శుద్ధ ఏకాదశి రోజున ప్రతిష్టించి అప్పుడు సీతారాముల కళ్యాణం జరిపించారట. అప్పటి నుంచి రామతీర్థంలో భీష్మ ఏకాదశి రోజున సీతారాములకు బ్రహ్మాండంగా ‘తిరుకల్యాణ మహోత్స’వాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది

రామతీర్థంలో ఏటా జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో వరుడు రామయ్య తరపున విజయనగరం పూసపాటి రాజ వంశీకులు లేదా వారి తరపున దేవస్థానం అధికారులు వ్యవహరిస్తారు. పూసపాటి రాజ వంశీయుల వశిష్ట గోత్రంతోనే వివాహం ఆద్యంతం నిర్వహిస్తారు.

వధువు సీతమ్మ తరపున పూసపాటిరేగకు చెందిన ఏకుల రామారావు కుటుంబీకులు హాజరవుతారు. వీరు సీతమ్మ తల్లి పెళ్ళికి పుట్టింటి కానుకగా బంగారు మంగళసూత్రాలతో పాటు ఇతర సామగ్రి తీసుకొస్తారు. నాలుకపై బీజాక్షరం రాసిన వృద్ధురాలు ఏకుల వంశీయులే.. రాముడి విగ్రహం కనుగొనడంలో సహాయం చేసిన వృద్ధురాలి వంశస్థులు ఆడపెళ్లి వారుగా వ్యవహరిస్తారని స్థానికులు చెబుతారు.

వివాహ మహోత్సవానికి ముందు రామతీర్థం ప్రధాన వీధిలో హంస, అశ్వ, గరుడ వాహనాలపై సీతారామలక్ష్మణ విగ్రహాలను ఉంచి, అర్చకులు నిర్వహించే ఎదురుసన్నాహ కార్యక్రమం కనులవిందుగా సాగుతుంది.

ఐదు రోజుల పెళ్ళి… ఆరుదైన పెళ్ళి! 

రామ తీర్థంలో శ్రీరామ నవమి రోజున నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ఒక్కరోజులో ముగుస్తుంది. అయితే తిరుకల్యాణ మహోత్సవం మాత్రం ఏటా ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. దానికి ముందు వచ్చే రథసప్తమి నాడు పందిరి రాట వేస్తారు. నూతన వధూవరులకు ఈ రోజే నూతన వస్త్రాలు, బంగారం కొనుగోలు చేస్తారు. కల్యాణోత్సవం జరిగే భీష్మ ఏకాదశి నాటి ఉదయం ధ్వజ స్తంభంపై ధ్వజారోహణం చేస్తారు. ఈ ఐదు రోజులు అర్చకులు ప్రత్యేక హోమాలు, గ్రామ బహిష్కరణ, సుందరకాండ పారాయణం, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)