రాహుల్ కొంపముంచిన మోదీ ఇంటి పేరు.. కోర్టు అనుమతిస్తే వేటు నుంచి తాత్కాలిక ఊరట

|

Mar 24, 2023 | 3:25 PM

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రకటించింది.

రాహుల్ కొంపముంచిన మోదీ ఇంటి పేరు.. కోర్టు అనుమతిస్తే వేటు నుంచి తాత్కాలిక ఊరట
Rahul Gandhi
Follow us on

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గాను ఇటీవల రాహుల్‌పై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన సూరత్‌ కోర్టు.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేసింది.

ప‌రువు న‌ష్టం కేసులో దోషిగా తేలిన నేప‌థ్యంలో రాహుల్ గాంధీ లోక్ స‌భ స‌భ్యత్వం ర‌ద్దు అయ్యింది. రాహుల్ ఎంపీగా చెల్లుబాటు కార‌ని లోక్ స‌భ సెక్రటేరియ‌ట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ మాజీ ఎంపీ అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తం చేసిన గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ.. సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు.

విచారణ జరిపిన సూరత్‌ కోర్టు.. రాహుల్‌ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను అలా అనలేదని రాహుల్‌ తన వాదనను వినిపించారు. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం కోర్టు.. ఆతడిని దోషిగా తేల్చింది. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూర‌త్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే పై కోర్టు రాహుల్ కు అనుకూలంగా వ‌స్తే ఎంపీ స‌భ్యత్వాం తిరిగి పొందాడానికి ఆవ‌కాశం ఉంది.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ కేరళ వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. తాజా నిర్ణయంతో ఆయన ఎంపీగా అర్హత కోల్పోయారు. తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈలోపే ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 8(3) ప్రకారం.. పార్లమెంట్‌ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు.

రాహుల్ గాంధీ లోక్‌ సభ సభ్యత్వం రద్దుపై రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని ఇవాళ అమలు చేసిందన్నారు ఖర్గే. దేశం ముందు వాస్తవాలను ఉంచేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తుంటే
బీజేపీకి మింగుడుపటటం లేదని, రాహుల్‌ను సభ నుంచి బయటికి పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుందని బీజేపీ భావిస్తోందని ఖర్గే అన్నారు. కానీ తాము సత్యం మాట్లాడటానికి భయపడమని వారి సమస్య ఇంకా పెరుగుతుందని ఖర్గే అన్నారు. రాహుల్‌ లోక్‌ సభ సభ్యత్వం రద్దు విషయంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సమావేశం జరుగుతుందని ఖర్గే అన్నారు.

కాగా గ‌తంలో లక్షద్వీప్‌కు చెందిన ఎన్‌సీపీ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌ను ఓ హత్యాయత్నం కేసులో స్థానిక కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో.. అతడిని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రెటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతరం సెషన్స్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎంపీ ఫైజల్‌.. కేరళ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ తీర్పు అమలును నిలిపివేసింది. ఈ పరిణామం తర్వాత ఆయన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర న్యాయశాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కూడా తీర్పును పై కోర్టులో స‌వాలు చేస్తారా లేదా అనేది చూడాలి.