Chandrababu Rayalaseema Visit: ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.. కానీ, ఏపీలో మాత్రం ప్రధాన పార్టీలన్నీ తగ్గేదేలే అంటూ పొలిటికల్ స్పీడును పెంచాయి.. అధికార పార్టీ వైసీపీ సహా.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇప్పటినుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో పర్యటనకు సిద్ధమవుతున్నారు. రేపటినుంచి (ఆగస్టు 1) చంద్రబాబు రాయలసీమలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలనతోపాటు టీడీపీ నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ విస్తరణ, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, పలు వ్యూహాల్లో భాగంగా చంద్రబాబు పర్యటించనున్నట్లు సమాచారం. అయితే, చంద్రబాబు పర్యటన ప్రారంభం కాకముందే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని చంద్రబాబు.. రాయలసీమ ప్రాజెక్టుల పరిశీలన ఎలా చేస్తారంటే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.
అసలు రాయలసీమకు ద్రోహం చేసిందే చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. క్షేమంగా ఉన్న అనంతపురం జిల్లాలో చంద్రబాబు అడుగుపెడితే క్షామం వస్తుందంటూ ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాయలసీమలోని ప్రాజెక్టుల పరిశీలనకు రానున్న చంద్రబాబు.. మూడో తారీఖు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బైరవానితిప్పే, హంద్రీనీవా కాలువ, పేరూరు డ్యామ్, కియా పరిశ్రమలను సందర్శించనున్నారు. కాస్తో.. కూస్తో వర్షాలు పడుతున్న అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తే వర్షం కూడా వెనక్కి పోతుందన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు అనంతపురం జిల్లాకు రావద్దంటూ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పొలిటికల్ హీట్ నెలకొంది. చంద్రబాబు రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామని ఇప్పటికే కొంతమంది హెచ్చరించారు. దీంతో అనంతపురం జిల్లా పోలీసులు చంద్రబాబు పర్యటన వివరాలు తెలుసుకుంటున్నారు.. కాగా.. ఇప్పటికే ఆయన పర్యటించే ప్రాంతాల రూట్ మ్యాప్, తదితర వివరాలను పరిశీలించిన పోలీసులు తదుపరి చర్యలు, బందోబస్తు తదితర విషయాలను చర్చిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..